పతాకానికి పరాభవమా?

17 Dec, 2021 07:35 IST|Sakshi
సభలో సభ్యుల ఆగ్రహావేశాలు

సాక్షి, బెంగళూరు(కర్ణాటక): మహారాష్ట్ర కొల్లాపురలో కన్నడ ధ్వజాన్ని దగ్ధం చేయడంపై విధానసభలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. జెండాను దగ్ధం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టాయి. దీంతో గురువారం బెళగావి విధానసభలో కొంత సమయం ఈ ఘటనపై గందరగోళ వాతావరణం నెలకొనింది. ఆ తర్వాత అసెంబ్లీలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ అనంతరం ముక్త కంఠంతో ఈ చర్యను తప్పుపట్టారు.

అన్ని పక్షాలు కన్నడ ధ్వజం తగులబెట్టడాన్ని తప్పుపడుతూ సభ ముందుకు వచ్చిన ఖండన తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ సమయంలో రెవెన్యూ మంత్రి ఆర్‌. అశోక్‌ ఎమ్మెల్యే ప్రశ్నలకు బదులివ్వబోతుండగా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. కన్నడ ధ్వజాన్ని దగ్ధం చేసిన దుండగులకు సరైన సందేశాన్ని పంపాలని జేడీఎస్‌ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.  

మరాఠా మండలి కోసం యత్నాళ్‌ గళం 
మరోవైపు బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్‌ యత్నాల్‌ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా మరాఠా అభివృద్ధి నిగమను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మొగలు చక్రవర్తులకు వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ పోరాడి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు.

మంత్రి ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున మరాఠ అభివృద్ధి నిగమ సాధ్యం కాదని చెప్పారు. అతి త్వరలో రూ. 50 కోట్లను విడుదల చేసి మరాఠా సముదాయ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు.

     

మరిన్ని వార్తలు