కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్‌ రాబోతోంది: రేవంత్‌రెడ్డి

24 Jun, 2022 18:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోడు భూములకు పట్టాలిస్తానని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాక పోడు భూముల రైతుల్ని మర్చిపోయాడని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కర్కంగూడెం జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు శుక్రవారం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 'పోడు భూమి రైతులకు పట్టాలిచ్చి వారిని యజమానులను చేసింది కాంగ్రెస్‌ పార్టీ. వందల మంది ఆదివాసీల పైన కేసులు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను చిన్న చూపు చూస్తుంది. హరితహారం పేరు మీద దాడులు చేస్తున్నారు. గిరిజన భూములు లాక్కుని లే అవుట్‌లు వేస్తున్నారు. 11నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోవాలి. పేదల ప్రభుత్వం రావాలి. తొందరలోనే అశ్వారావు పేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్‌ రాబోతోందని' టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ చేరిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 'రుణమాఫీ హామీ ని గాలికొదిలేసారు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లు నిర్మిస్తే అయిపోద్దా.. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వల్ల ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి భధ్రాచలం వచ్చి పోడు భూమి రైతులకు పట్టాలిచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. గిరిజనులకు న్యాయం జరుగుతుంది' అని తాటి వెంకటేశ్వర్లు అన్నారు.

చదవండి: (Hyderabad: అరోరా కాలేజీలో జరగాల్సిన జేఈఈ పరీక్ష వాయిదా)

మరిన్ని వార్తలు