అసెంబ్లీకి వెళ్తాం..చంద్రబాబు మాత్రం హాజరుకారు 

6 Mar, 2022 05:01 IST|Sakshi

టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల వెల్లడి 

చివరివరకూ బాబు నాన్చుడు ధోరణి 

సాక్షి, అమరావతి: వచ్చే శాసన సభ బడ్జెట్‌ సమావేశాలకు హాజరవుతామని టీడీపీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం సభకు రారని, మిగిలిన సభ్యులంతా హాజరుకావాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం జరిగిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడారు.  

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే సీఎంగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు చెప్పిన మాటకు ఆయన కట్టుబడే ఉన్నారని, ఆయన సభకు రారని తెలిపారు. అమరావతి, పోలవరం,  హోదా తదితర సమస్యలను లేవనెత్తుతామన్నారు. రాజధానిపై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినా వైఎస్సార్‌సీపీ సభ్యులు కొత్తగా చట్టం తీసుకొస్తామంటున్నారని విమర్శించారు. సమస్యలను చర్చించేందుకు వస్తున్నామని యనమల స్పష్టం చేనశారు. 

చివరి వరకూ బాబు సాగదీత 
అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై చంద్రబాబు ఎప్పటిలానే నాన్చుడు ధోరణి అవలంబించారు. వాస్తవానికి 10 రోజుల క్రితమే  తన ఎమ్మెల్యేలను సభకు పంపాలని నిర్ణయించారు. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చర్చలు జరుపుతున్నట్లు లీకులిచ్చారు. ఒక దశలో గైర్హాజరవుతున్నట్లు లీకులిచ్చారు.  చివరికి హాజరవుతున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు