రిటైర్‌ అయినా వదిలిపెట్టం: అచ్చెన్నాయుడు

22 Jan, 2021 15:03 IST|Sakshi

అన్నీ నోట్‌ చేసుకుంటున్నాం.. రిటైర్డ్‌ అయినా వదలం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

అలిపిరి వద్ద టీడీపీ రాజకీయ రచ్చ

మహిళా ఎస్‌ఐని బెదిరించిన ‘నిమ్మల’

తప్పుడు ప్రచారం చేస్తే అరెస్టు చేస్తామన్న డీఐజీ

సాక్షి, తిరుపతి/తిరుపతి అర్బన్‌: ‘ పోలీసులకు బుర్ర లేదు. ఉద్యోగ సంఘాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. అన్నీ నోట్‌ చేసుకుంటున్నాం. రిటైర్డ్‌ అయినా కూడా ఎవరినీ వదలం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ధర్మపరిరక్షణ యాత్ర పేరుతో గురువారం అలిపిరి వద్ద టీడీపీ నేతలు రచ్చ చేశారు. పలుచోట్ల రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. శాంతియుతంగా ర్యాలీ చేసుకోవాలని కోరినా పట్టించుకోకపోవడంతో.. చివరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఎమ్మార్‌పల్లె, చంద్రగిరి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మరోవైపు టౌన్‌క్లబ్‌ సర్కిల్‌ వద్ద బహిరంగసభ నిర్వహించడానికి బయల్దేరుతున్న అచ్చెన్నాయుడును తిరుచానూరు సమీపంలోని ఓ హోటల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి: అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు)

అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించి తీరుతామన్నారు. సంతబొమ్మాళిలో ఏం జరిగిందో చర్చించేందుకు రావాలని వైఎస్సార్‌సీపీకి సవాల్‌ విసిరారు. ఆలయంలో నంది విగ్రహం ఖాళీగా ఉంటే.. తీసుకొచ్చి దిమ్మెపై పెట్టారన్నారు. దీనికే ఆలయంలో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ కూడా యాత్ర చేస్తుంది కదా? అని మీడియా ప్రశ్నించగా.. తమది స్వచ్ఛమైన యాత్ర అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. కాగా, టీటీడీ నిబంధనలను పట్టించుకోకుండా.. అలిపిరి వద్ద పసుపు జెండాలు కట్టి టీడీపీ నేతలు రాజకీయ ప్రచారం చేయడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. (చదవండి: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం)

ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా
తిరుచానూరు సమీపంలోని హోటల్‌ వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐ దీపిక పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఆమె కాలును తొక్కడమే కాకుండా.. ‘ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా..’ అంటూ బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళా ఎస్‌ఐ దీపిక కన్నీరుపెట్టుకున్నారు.

మాదంతా ఖాకీ కులం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు పోలీస్‌ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని, తమకు కులమతాలు ఉండవని, తమదంతా ఖాకీ కులమని డీఐజీ, ఏపీ పోలీస్‌ టెక్నికల్‌ చీఫ్‌ పాలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో గురువారం డీజీపీ డి.గౌతమ్‌సవాంగ్‌ సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబుతో కలిసి పాలరాజు మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలీస్‌ వ్యవస్థను దిగజార్చేలా రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఆపదలో ఆలయాలు అంటూ రాజకీయ నేతలు దుష్ప్రచారం చేయడం తగదన్నారు.

వాస్తవంగా 2015 నుంచి 2021 వరకు నమోదైన కేసులను గమనిస్తే 2020–21లో ఆలయ ఘటనలు పెరగలేదన్నారు. ఈ ఏడాది 44 కేసుల్లో 29 కేసులు నిగ్గు తేల్చి దోషులను అరెస్టుచేసినట్లు ఆయన చెప్పారు. తొమ్మిది కేసుల్లో రాజకీయ నేపథ్యం కలిగిన వారున్నారన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.   పోలీసు శాఖ సూచించిన నిబంధనలను ఉల్లఘించినందుకే టీడీపీ తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతిని రద్దుచేసినట్లు శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబు చెప్పారు. 

మరిన్ని వార్తలు