అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం

19 May, 2021 05:21 IST|Sakshi

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ):  రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రేపు (గురువారం) నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. విశాఖలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించడం ఆనవాయితీగా వస్తోందని, కేంద్రం కూడా ఇలాగే చేసిందని చెప్పారు. ఇప్పుడు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఒక రోజు సమావేశం నిర్వహించి అన్ని తూతూ మంత్రంగా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. బాధ్యత గల సీఎం అయితే అఖిలపక్ష సమావేశం నిర్వహించి కరోనా నియంత్రణపై చర్చించేవారని చెప్పారు. ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆక్సిజన్‌ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం ఈ లెక్కలను తక్కువగా చూపిస్తోందన్నారు. కరోనాతో ప్రజలు ఆర్తనాదాలు చేస్తుంటే దహన సంస్కారాలకు రూ.15 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. త్వరలో జూమ్‌ ద్వారా మాక్‌ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ తప్పులను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు