అక్కడో మాట.. ఇక్కడో మాట.. అచ్చెన్న దొంగాట!

13 Aug, 2022 07:26 IST|Sakshi

పాతపట్నంలో డబుల్‌ గేమ్‌

ఎవరిని ముంచేస్తారో తెలియని రాజకీయం

అదే అనుమానంతో లోకేష్‌ను లైన్లో పెట్టిన మామిడి

నిమ్మాడ పెద్దలపైనే కలమట ఆశలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘వాడు(మామిడి గోవిందరావు) వచ్చి చంద్రబాబు నాయుడుకు ఒక చెక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అది తీసుకున్నాడు. చెక్కు కాదు వాడు ఆస్తి రాసి ఇమ్మను. పార్టీ వాడుకుంటుంది. మామిడి గోవిందరావుకు టిక్కెట్టా... ఆ ఆలోచన ఎందుకు. కలలో కూడా అది ఉహిస్తారా... నా ప్రయత్నం ఏమిటంటే వాడు కూడా నీకు ఉపయోగపడతాడని, నీ చేతిలో పెట్టాలని నా ప్రయత్నం. నా ఆలోచన అదే. నేననేది వాడు చేయకపోయినా ఫర్వాలేదు. మన వెనక తిరిగినట్టు ఉంటే  పార్టీ బలంగా ఉందన్న ఆ మెసేజ్‌ వెళతాది కదా?’ మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా నిమ్మాడలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్న మాటలివి.’ 
చదవండి: గోరంట్ల మాధవ్‌ వీడియో అంశం: చెత్త వ్యూహంతో టీడీపీ దెబ్బ తిందా?

‘నువ్వేమీ బాధపడొద్దు. అక్కడ అలా అనక తప్పలేదు. నీకు ఎందుకు నేనున్నాను. కలమట వెంకటరమణ గురించి పట్టించుకోకు. నీ పని నువ్వు చేసుకో...’ 
మామిడి గోవిందరావుతో అదే కింజరాపు  అచ్చెన్నాయుడు అన్న మాటలివి. 

పాతపట్నంలో టీడీపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోంది. ఎవరు ఎవర్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరు ఎవర్ని వాడుకుంటారో, అగ్ర నేతల మధ్య ఏ నేత బలి పశువు అవుతారో అంతు చిక్కని విధంగా తయారైంది. 2024 ఎన్నికల్లో తనకే టిక్కెట్‌ వస్తుందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ధీమాతో ఉన్నారు. తనకున్న సందేహాలను పార్టీ సమావేశాల్లోనూ, నిమ్మాడలోనూ నివృత్తి చేసుకున్నారు. కానీ అదే నియోజకవర్గంలో పార్టీ టిక్కెట్‌ రేసులో నేనున్నాంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, సామాజిక వేత్త మామిడి గోవిందరావు దూకుడు చూపిస్తున్నారు.

గెలుపోటములు పక్కన పెడితే కలమటను పక్కకు తప్పించడమే లక్ష్యంగా మామిడి జోరు చూపిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ తరఫున తిరుగుతున్నారు. కలమట వెంకటరమణకు ధీటుగా శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పార్టీలు మారే కలమటను ఎవరు నమ్ముతారని, ఆయనైతే చిత్తు చిత్తుగా ఓడిపోతారంటూ మామిడి తనదైన శైలిలో పార్టీలో బలం పెంచుకుంటున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా మామిడి గోవిందరావు తరచూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలవడం, సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ ఫండ్‌ కోసం లక్షల రూపాయలు అందజేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా ఫండ్‌ కోసం మామిడి గోవిందరావును వాడుకుంటున్నారా? లేదంటే అచ్చెన్నాయుడును ఓవర్‌ టేక్‌ చేసి ముందు చూపుతో మామిడి గోవిందరావే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు రాక మానవు.

అచ్చెన్నాయుడు అన్నట్టుగా మామిడి గోవిందరావును వాడుకోవడానికే తిప్పుకుంటున్నారని, ఎన్నికలు వచ్చాక కలమట వెంకటరమణ కోసం పనిచేయమని చెబుతారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఓ వర్గం భావిస్తోంది. మరోవైపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని మామిడి గోవిందరావు వ్యూహాత్మకంగా లోకేష్‌తో సంబంధాలు పెట్టుకుని ఉండవచ్చనే అనుమానం మరో వర్గం వ్యక్తం చేస్తోంది.

అచ్చెన్నాయుడు, లోకేష్‌ మధ్య పెద్దగా సంబంధాల్లేవని, అవకాశం వచ్చినప్పుడుల్లా పార్టీని, లోకేష్‌ను బజారు కీడ్చేలా మాట్లాడుతున్న అచ్చెన్నాయుడును నమ్మే పరిస్థితి లేదని, ఆయన చెప్పిన విధంగా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆ వర్గం భావిస్తోంది. అచ్చెన్నాయుడు విషయంలో అవకాశం కోసం లోకేష్‌ ఎదురు చూస్తున్నారని, అదను చూశాక దెబ్బ కొడతారని ఆ వర్గం గట్టిగా నమ్ముతోంది. అందుకనే అచ్చెన్నాయుడ్ని కాదని నేరుగా లోకేష్‌తో మామిడి గోవిందరావు సత్సంబంధాలు నెరుపుతున్నారనే వాదన ఉంది. అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్న కలమట వెంకటరమణను కాదని తనకే టిక్కెట్‌ ఇస్తారన్న బలమైన నమ్మకంతో ఖర్చుకు వెనకాడకుండా మామిడి ఆరాటపడుతున్నారని టీడీపీ నేతలంటున్నారు.

మొత్తానికి పాతపట్నం టీడీపీలో టీడీపీ మాస్టర్‌ ప్లాన్‌ నడుస్తోంది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నేత మామిడి గోవిందరావు మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. పథకం ప్రకారం కూరలో కరివేపాకులా మామిడిని వాడుకుంటారా? లేదంటే కలమట వెంకటరమణను పక్కన పెట్టి మామిడికి సీటు ఇస్తారా? అన్నది వేచి చూడాలి.   

మరిన్ని వార్తలు