టీడీపీకి ఓటు వేయను అన్నందుకు దళితుడిని కొట్టుకుంటూ..

15 Nov, 2021 17:20 IST|Sakshi
ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు

కులం పేరుతో దూషణ

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు 

మాకవరపాలెం: విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో టీడీపీకి ఓటు వేయనన్న దళితుడిపై ఆ పార్టీవారు దాడిచేసి కొట్టారు. కులం పేరుతో దూషించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు గంట్యాడ రాజు తనపై దాడిచేసి కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. మండలంలోని భీమబోయినపాలెం గ్రామానికి చెందిన గంట్యాడ రాజు శనివారం రాత్రి ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ భవనం వద్ద ఉన్నారు. అదే సమయంలో ఈ నెల 16న జరగనున్న ఎంపీటీసీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు తమ పార్టీకి ఓటు వేయాలని రాజును కోరారు.

తాను టీడీపీకి ఓటు వేయనని, వైఎస్సార్‌సీపీకే వేస్తానని రాజు చెప్పారు. దీంతో వారంతా ఆయనపై దాడిచేసి కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. కులం పేరుతో నానా దుర్భాషలాడారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తనపై దాడిచేశారని, దీనిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని రాజు పోలీసుల్ని కోరారు. గాయపడిన రాజును బంధువులు వెంటనే 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని, విచారిస్తున్నామని ఎస్‌ఐ రామకృష్ణారావు చెప్పారు.
(చదవండి: కుప్పంలో మరోసారి టీడీపీ నేతల దౌర్జన్యం)

మరిన్ని వార్తలు