చినపులిపాక సర్పంచ్‌పై టీడీపీ వర్గీయుల దాడి

6 Sep, 2021 02:28 IST|Sakshi
విజయవాడలో శివరామకృష్ణను పరామర్శిస్తున్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌

ఓ స్థలం విషయంలో ఓ వ్యక్తిని దుర్భాషలాడిన టీడీపీ నేతలు

ఈ విషయాన్ని ప్రశ్నించిన సర్పంచ్‌ శివరామకృష్ణపై దాడి

తమపైనే దాడి చేశారంటూ పెద్ద పెద్ద కట్లతో హైడ్రామా

ఆక్రమణలను ప్రశ్నిస్తే దాడులు తగవని ఎమ్మెల్యే కైలే అనిల్‌ మండిపాటు

తోట్లవల్లూరు (పామర్రు), లబ్బీపేట (విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చినపులిపాక గ్రామంలో ఓ స్థలం వ్యవహారంలో వైఎస్సార్‌సీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ ఆరేపల్లి శివరామకృష్ణ (రాము)పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. చినపులిపాక–వల్లూరుపాలెం మధ్య ఆర్‌ అండ్‌ బీ రహదారి పక్కన ఉన్న ఓ స్థలానికి సంబంధించి, గ్రామానికి చెందిన నాగరాజును టీడీపీ వర్గీయుడు కాగిత శ్రీనివాసరావు, అతని కుటుంబ సభ్యులు ఆదివారం దుర్భాషలాడారు. దీనిపై ప్రశ్నించటానికి వెళ్లిన సర్పంచ్‌ ఆరేపల్లి శివరామకృష్ణతో వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది.

ఈ దశలో సర్పంచ్‌ వర్గీయులు ప్రతిఘటించడంతో శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయపడిన సర్పంచ్‌ను తొలుత కంకిపాడు ఆస్పత్రికి, తర్వాత విజయవాడకు తరలించారు. ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, చినపులిపాకలో సర్పంచ్‌పై దాడి చేసిన టీడీపీ నేత తనపైనే దాడి జరిగిందంటూ తలకు కట్టుకట్టుకుని ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షించి, పెద్దగా దెబ్బలు లేక పోవడంతో వెంటనే పంపించి వేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, వీరపనేని శివరామ్, వీరంకి గురుమూర్తి మరికొందరు డ్రామాకు తెరలేపారు. అనుకూలమైన టీవీ చానళ్ల విలేకరులను పిలిచి రెండు గంటలు డ్రామా నడిపించారు.  

దాడి చేసి రాజకీయమా?  
అనవసరంగా ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించిన సర్పంచ్‌పై తండ్రీ కొడుకులు ఇనుప రాడ్డుతో దాడి చేయడం దుర్మార్గమని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ మండిపడ్డారు. దాడి చేయడమే కాకుండా, తమ వారిపైనే వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ దాడి చేశాడంటూ టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్‌ శివరామకృష్ణను ఆదివారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ వాతావరణాన్ని కలుషితం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఆక్రమణలను ప్రశ్నిస్తుంటే దాడులకు తెగబడుతున్నారన్నారు. శివరామకృష్ణ తలకు బలమైన గాయమైందని, ఐదు కుట్లు వేశారని చెప్పారు. టీడీపీ వర్గీయుడికి ఒక్క కుట్టు పడకున్నా, పెద్ద పెద్ద కట్లు కట్టుకుని డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. 

మరిన్ని వార్తలు