ఏం సాధించారని రథయాత్ర

19 Jan, 2021 04:37 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి, చిత్రంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి తదితరులు

బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి 

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

మహారాణిపేట(విశాఖ దక్షిణ): బీజేపీ నాయకులు రథయాత్ర దేనికోసం చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇక్కడి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో విజయవాడలో విగ్రహాలు,ఆలయాలు పడగొడితే అప్పుడు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. అదే విగ్రహాలకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారని. ఇలాంటి మంచి పనులను బీజేపీ నాయకులు ఎందుకు అంగీకరించరని ప్రశ్నించారు. 

► రాష్ట్రంలో  రెండు రకాల  బీజేపీ నాయకులు  ఉన్నారని, ఒకరు నిజమైన బీజేపీ నాయకులని, మరొకరు చంద్రబాబునాయుడు పంపిన  నాయకులని చెప్పారు.  ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గ్రహించాలని సూచించారు.
► రథయాత్ర ప్రారంభించే ముందు బీజేపీ ఆలోచించాలని, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై బీజేపీ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
► అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినా నేటివరకు విచారణ ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. విశాఖలో రైల్వే జోన్, కర్నూలులో హైకోర్టు, కడప స్టీల్‌ప్లాంటు, వరద నష్టాలకు ఆర్థిక సహాయం వంటివి వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి, అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులకు లేదా? అని ప్రశ్నించారు.   ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె.రాజు తదితరులు పాల్గొన్నారు.    

>
మరిన్ని వార్తలు