ఉక్కు సంకల్పంతో పోరాడతాం

8 Feb, 2021 03:46 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 

టీడీపీకి ఓ విధానమే లేదు.. ప్రధానికి లేఖ రాసే దమ్ముందా బాబు?

రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో మాట్లాడాలి

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి తలమానికం లాంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఆదివారం విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలకు ఒక విధానం లేదని విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులపై ప్రేమ ఉంటే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాయాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని వద్ద మాట్లాడాలన్నారు. కేంద్ర విధానాలు, విదేశీ డంపింగ్, సొంత గనులు లేకపోవడం తదితర కారణాలతో మూడేళ్ల నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌  నష్టాలను చవిచూస్తోందని తెలిపారు. 

1.30 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం
స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.30 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే వైఎస్సార్‌ సీపీ నుంచి తొలి ఎంపీగా తాను రాజీనామా చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు కె.కె రాజు, అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అల్లంపల్లి రాజుబాబు, ముఖ్యనాయకులు రవిరెడ్డి, మంత్రి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు