ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతు

9 Mar, 2021 19:18 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని తెలిపారు. తమకు తెలిసి జరుగుతోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తే అన్ని పక్షాలను తీసుకెళ్లి సమస్య వివరిస్తామని తెలిపారు. తాము కేంద్రంతో రాజీ పడితే పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నిస్తామని అన్నారు. పార్లమెంట్‌లో బలం ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ, కేంద్రాన్ని విమర్శించకుండా తమపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యేవరకు ఉద్యమానికి మద్దతుగా ఉంటామని వెల్లడించారు. సబ్బంహరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. సబ్బంహరికి సిగ్గుంటే టీడీపీకి రాజీనామా చేయాలని, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని కాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పార్టీలో సబ్బంహరి ఎలా ఉంటారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం పవన్‌ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు.

పార్లమెంట్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై ప్రశ్నించానని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కేంద్ర వైఖరిని తెలుసుకునేందుకు ప్రశ్నించినట్టు తెలిపారు. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వాళ్లెవరైనా ప్రశ్నించారా అని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ ప్రైవేటీకరణపై ప్రశ్నించాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడుతామని తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నాడని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. త్యాగాల పునాదులపై విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించారని, ప్రధాని మోదీ పేరు ఎత్తితే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు.

చదవండి: ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్‌
చదవండి: భగ్గుమన్న స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక వర్గం

మరిన్ని వార్తలు