బాబ్రీ తీర్పు.. బీజేపీకి చేతికి నయా అస్త్రం

1 Oct, 2020 10:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన బాబ్రీ మసీదు విధ్వంసం చేసులో పాలక బీజేపీకి అనుకూలంగా తీర్పు రావడంతో కకమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన మసీదును ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌, కరసేవకులు కూల్చివేశారనే ఆరోపణలు తొలినుంచీ వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ తాజాగా లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెక్‌పెట్టింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా నిర్దోషులేనని ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది. దీంతో 28 ఏళ్లుగా నిందను మోస్తున్న బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమా భారతీతో పాటు మరికొంత మందికి ఈ కేసు నుంచి ఊరట లభించింది. దేశంలో ఓ వైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ తీర్పు రావడం కమలనాథులకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (తొలగిన మచ్చ.. దక్కిన ఊరట)

కీలకమైన బిహార్‌ అసెంబ్లీతో పాటు దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటిలో మధ్యప్రదేశ్‌లోని 24 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రానున్న ఏడాదిన్నర కాలంలో పంజాబ్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే బాబ్రీ విధ్వంసానికి బీజేపీ నేతలు పాల్పడలేదని తాజాగా కోర్టు స్పష్టం చేయడంతో ఈ ఎన్నికల్లో వారికి కొంతమేర లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. మసీదు కూల్చివేత అనేది కుట్రపూరితంగా, ప్రణాళిక ప్రకారం జరగలేదని న్యాయస్థానం ప్రకటించడం బీజేపీ భవిష్యత్‌కు బాటలు వేయడంలాంటిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజా తీర్పుతో మైనార్టీలో ఉన్న అపనింద కూడా తొలగిపోతుందని భావిస్తున్నారు. (కమలనాథుల్లో కొత్త ఉత్సాహం)

ఈ తీర్పుతో రానున్న కాలంలో ఎన్నికలు జరుగనున్న బిహార్‌, బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో ఏమాత్రం పట్టులేని బీజేపీ ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. అనూహ్యంగా 40.64 శాతం ఓట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో 34 ఎంపీ స్థానాలను గెలుచుకున్న పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) 22 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్‌, వామపక్షాలు ఘోర పరాజయం చవిచూడక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీని చూసి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టు సడలకుండా చూసుకోవడానికి ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను తన రాజకీయ సలహాదారుడిగా నియమించుకున్నారు.

ఈ తరుణంలో బాబ్రీ మసీదు తీర్పు రావడంతో దానిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. ఇక బీజేపీ ప్రయోగించిన ఈ అస్త్రాన్ని ఎదుర్కొవడం విపక్షాలకు పెను సవాలే.

మరిన్ని వార్తలు