మంత్రివర్గంలో స్థానం కోల్పోవడంతో బాబుల్‌ సుప్రియో సంచలన నిర్ణయం

31 Jul, 2021 18:19 IST|Sakshi

కలకత్తా: ఇటీవల కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబూల్‌ సుప్రియో అలిగారు. తనకు మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఇక రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ఆయన శనివారం సంచలన ప్రకటన చేశారు. దీంతోపాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని సోషల్‌ మీడియా వేదికగా బాబుల్‌ సుప్రియో తెలిపారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్‌తో పాటు ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి పెద్ద షాక్‌ ఇచ్చింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్‌ సుప్రియో ప్రముఖ గాయకుడు. బీజేపీలో 2014 నుంచి కొనసాగుతున్నాడు. ‘అల్విదా’ అంటూ ప్రారంభించి తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సుదీర్ఘ లేఖను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘అల్విదా.. నేను తృణమూల్‌, కాంగ్రెస్‌, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి చేరడం లేదు. ఆ పార్టీల్లోకి రావాలని నన్ను ఎవరూ పిలవలేదు.

నేను ఒకే టీం ప్లేయర్‌ను. ఎప్పటికీ ఒకే పార్టీ (బీజేపీ)లో ఉంటా. నా వల్ల కొంతమంది సంతోషపడగా.. మరికొందరు బాధపడ్డారు. సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఒక నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం అసాధ్యం. నన్ను తప్పుగా అనుకోకండి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. వీటిలతో మరికొన్ని విషయాలను ఆ ప్రకటనలో ప్రస్తావించారు.

2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్‌ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్‌ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్‌ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో బాబుల్‌ సుప్రియోకు చోటు దక్కలేదు. అందుకు కారణం లేకపోలేదు. తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్‌ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది.

అనూహ్యంగా సుప్రియో తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్‌లో చేరుతారని వార్తలు వినిపించగా అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

మరిన్ని వార్తలు