Badvel Bypoll Results: బద్వేలు బ్లాక్‌ బస్టర్‌

3 Nov, 2021 02:28 IST|Sakshi
ఘన విజయం సాధించిన తర్వాత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్న డాక్టర్‌ సుధ

రికార్డు స్థాయిలో 90,533 ఓట్ల మెజార్టీ.. కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధకు వచ్చిన ఓట్లు 1,12,211 

బద్వేలు ఉప ఎన్నికలో రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతు

బీజేపీ అభ్యర్థికి 21,678 ఓట్లు

కాంగ్రెస్‌కు 6,235..నోటాకు 3,650 ఓట్లు

అన్ని రౌండ్లలో అధికార పార్టీ ఆధిపత్యం

ఈసారి పోలింగ్‌ శాతం తగ్గినా వైఎస్సార్‌సీపీకి రెట్టింపు మెజార్టీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనకు మరోసారి ప్రజాదీవెన.. ఆనందోత్సాహాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సాక్షి ప్రతినిధి, కడప: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత నెల 30న పోలింగ్‌ జరగ్గా మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో  వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధకు రికార్డు స్థాయిలో 90,533 ఓట్ల మెజార్టీ లభించింది. డాక్టర్‌ సుధకు మొత్తం 1,12,211 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పణతల సురేష్‌కు 21,678 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 6,235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,650 ఓట్లు పడ్డాయి. మిగిలిన 12 మంది అభ్యర్థులకు 3,389 ఓట్లు వచ్చాయి. మూడు చెల్లని ఓట్లు పడ్డాయి. బద్వేలులో మొత్తం 2,15,240 మంది ఓటర్లకుగానూ 1,47,166 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 

పోస్టల్‌ బ్యాలెట్లతో ఆధిక్యం ఆరంభం
మంగళవారం ఉదయం 8.00 గంటలకు బద్వేలులోని బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించగా వైఎస్సార్‌ సీపీ భారీ ఆధిక్యం సాధించింది. 183 పోస్టల్‌ బ్యాలెట్లలో 139 ఓట్లు అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి లభించాయి. బీజేపీ అభ్యర్థికి 17, కాంగ్రెస్‌ అభ్యర్థికి 18 చొప్పున ఓట్లు వచ్చాయి. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా 9.00 గంటల ప్రాంతంలో తొలి రౌండ్‌ ఫలితం వెలువడింది. మొదటి రౌండ్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధకు 8,790 ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తర్వాత వరుసగా 13 రౌండ్లలోనూ భారీ మెజార్టీ వచ్చింది. తొలుత 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాలని భావించినా ఒక ఈవీఎం మొరాయించడంతో దానికి సంబంధించి 13వ రౌండ్‌లో వీవీ ప్యాట్లను లెక్కించారు. దీంతో మొత్తం 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ముగిసింది. జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌తోపాటు ఎన్నికల అబ్జర్వర్ల సమక్షంలో భారీ బందోబస్తు మధ్య లెక్కింపు ప్రశాంతంగా పూర్తైంది.

రెట్టింపు మెజార్టీతో విజయభేరి
బద్వేలులో గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరపున గెలిచిన దివంగత డాక్టర్‌ వెంకట సుబ్బయ్యకు 44,734 ఓట్ల మెజార్టీ లభించింది. వెంకట సుబ్బయ్యకు 60.89 శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌కు 32.36 శాతం ఓట్లు వచ్చాయి. 1,56,819 (76 శాతం) ఓట్లు పోల్‌ అయ్యాయి. ఈ ఎన్నికల్లో 1,47,166 (68.39 శాతం) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 8 శాతం తక్కువగా పోలింగ్‌ నమోదైనా వైఎస్సార్‌ సీపీకి గతంలో కంటే రెట్టింపు మెజార్టీ లభించడం గమనార్హం.

ఆనందోత్సాహాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు
ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ రికార్డు మెజార్టీతో విజయం సాధించడంతో బద్వేలు నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నాయి. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజాదరణకు తాజా ఎన్నికల తీర్పు నిదర్శనమన్నారు.

స్వచ్ఛమైన పాలనకు లభించిన విజయం
‘ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. నాడు బద్వేలు ప్రజలు నా భర్త, దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకటసుబ్బయ్యకు 44వేల మెజారిటీ ఇస్తే నేడు సీఎం జగన్‌ నిష్పక్ష పాలన, సామాజిక న్యాయం, మాట మీద నిలబడే తత్వం చూసి నాకు 90 వేల పైచిలుకు మెజారిటీతో విజయం చేకూర్చారు. నిధులు కేటాయించిన పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేస్తాం. నాకు టిక్కెట్‌ ఇచ్చి పోటీ చేసేందుకు ప్రోత్సాహం అందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. నా విజయానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి డీసీ గోవిందరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా విజయం కోసం అక్క చెల్లెమ్మలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు కృషి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి వారి రుణం తీర్చుకుంటా’
– డాక్టర్‌ దాసరి సుధ, బద్వేలు ఉప ఎన్నిక విజేత

మరిన్ని వార్తలు