ఎంఎన్‌ఎస్‌కు బీజేపీ ‘కాంట్రాక్ట్’

3 May, 2022 17:03 IST|Sakshi

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

ముంబై: మహారాష్ట్రలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి బీజేపీ నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కాంట్రాక్టు తీసుకుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఎంఎన్‌ఎస్ పేరు ప్రస్తావించకుండా ఆయన ఈ ఆరోపణలు చేశారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో ఎంఎన్‌ఎస్‌ ఆటలు సాగబోవని హెచ్చరించారు. ‘శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ‘కాంట్రాక్ట్’ కుదుర్చుకున్నంత మాత్రాన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినద’ని ఉద్ఘాటించారు.

మే 4వ తేదీలోపు మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్లను తొలగించాలని ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్ థాకరే అల్టిమేటం జారీ చేశారు. ఔరంగాబాద్‌లో ఆదివారం జరిగిన మహారాష్ట్ర దినోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘మే 4 నుంచి మేము వినం. మీరు మీ లౌడ్ స్పీకర్లతో ఇబ్బందిని సృష్టించడం కొనసాగిస్తే, మేము హనుమాన్ చాలీసాను మసీదుల ముందు రెట్టింపు పరిమాణంలో ప్రసారం చేస్తామ’ని రాజ్ థాకరే హెచ్చరించారు.

శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో రాజ్ థాకరే వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘శివసేనను లక్ష్యంగా చేసుకుని మే 1న ముంబైలో బీజేపీ ‘బూస్టర్ డోస్’ ర్యాలీని ప్లాన్ చేయగా, ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో బీజేపీ ఉంపుడుగత్తె ఎమ్‌ఎన్‌ఎస్‌.. శరద్ పవార్‌ను లక్ష్యంగా చేసుకుంద’ని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. మహా వికాస్ అఘాదీని ఎదుర్కోవడానికి కొన్ని చిన్న పార్టీలను బీజేపీ వాడుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించాలని భ్రమల్లో ఉన్నవారు.. వాస్తవంలోకి రావాలని సూచించారు. (క్లిక్‌: కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన సీనియర్‌ నేతలు)

మరిన్ని వార్తలు