అప్పుడే మోదీకి సపోర్ట్‌ చేశాం: సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

1 May, 2022 20:37 IST|Sakshi

ముంబై: గుజరాత్‌లో గోద్రా అల్లర్ల తరువాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌ ఠాక్రే మద్దతుగా నిలిచారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం ఓ సభలో మాట్లాడుతూ.. ‘గోద్రా అల్లర్ల తరువాత మోదీ హఠావో ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలోనే ఆద్వానీ ఓ ర్యాలీ కోసం ముంబై వచ్చారు. అప్పుడు బాలా సాహెబ్‌తో మాట్లాడుతూ.. మోదీని తొలగించాల్సి ఉంటుందా అని అడిగారు. దీనిపై బాలా సాహెబ్‌ స్పందిస్తూ.. లేదు అతని జోలికి వెళ్లకండి. ‘మోదీ గయాతో గుజరాత్‌ గయా’(మోదీ పోతే, గుజరాత్‌ పోయినట్లే) అని తెలిపారు. మోదీ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. కానీ మేము హిందుత్వానికి మద్దతు ఇచ్చాం’ అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఇప్పటికి కూడా మోదీతో సత్సంబంధాలు ఉన్నాయని, కానీ దానర్థం పొత్తు పెట్టుకుంటామని కాదని స్పష్టం చేశారు. అయితే  ప్రస్తుతం మహారాష్ట్రలో మసీదుల్లో లౌడ్‌  స్పీకర్లు, హనుమాన్‌ చాలీసా పారాయణం వంటి వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో హిందుత్వంపై శివసేన వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖల్యు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  
చదవండి: ఒక్క అవకాశం ఇవ్వండి.. అలా చేయకుంటే తరిమికొట్టండి: కేజ్రీవాల్

బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్‌లాగే మహారాష్ట్రలో త్వరలో ప్రతిఘటనను ఎదుర్కోవచ్చని తెలిపారు. ‘ప్రతిదానికి ఓ పరిమితి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ వెళ్లాలంటే కేంద్ర ఏజెన్సీలు భయపడుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి రాకూడదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర సంస్థలను ఉపయోగించుకోకూడదు. రాజకీయ నాయకులు చేసిన దానికి అధికారులు భయపడుతున్నారు. ప్రధాని దేశం మొత్తానికి. ఆయన దేశ శత్రువులతో పోరాడాలి.

అదే విధంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్‌ రాజ్ ఠాక్రేపై సీఎం విరుచుకుపడ్డారు. కొంతమంది ఎప్పటికీ జెండాలు మారుస్తూనే ఉంటారని విమర్శించారు. ‘ముందుగా వారు మరాఠీయేతరులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడేమో  హిందువేతరులపై దాడులు చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ కాలం. ఇది పని చేయకుంటే ఇంకొకటి. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఒక మతం గురించి చెప్పిందని నేను అనుకోను. మార్గదర్శకాలు అన్ని మతాలకు వర్తిస్తాయి’ అని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు.
చదవండి: 118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా.. చాక్లెట్, ఓ గ్లాస్‌ వైన్‌

మరిన్ని వార్తలు