గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం లేదు: దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు

31 Jan, 2023 09:16 IST|Sakshi

రాజ్యాంగబద్ధమైన పదవిపై ప్రభుత్వాలు, పార్టీలు అవగాహన కల్పించుకోవాలి

ఉద్యోగుల జీతాల విషయంలో గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం లేదు

హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ 

సాక్షి, విశాఖపట్నం/సింహాచలం: రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన గవర్నర్‌ వ్యవస్థతో రాజకీయాలు చేయడం సరికాదని హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. సోమవారం విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉన్న బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ మాజీ చైర్మన్‌ చెరువు రామకోటయ్య నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

గాంధీజీ వర్థంతి సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రా­జ్యాం­గబద్ధమైన పదవిపై ప్రభుత్వాలు, పార్టీలు అవగాహన కల్పించుకొని.. గవర్నర్‌ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. ఆ వ్యవస్థ నచ్చకపోతే రాజకీయం చేయడం మాని పార్లమెంట్‌లో చర్చించాలన్నారు. ఇటీవల ఏపీలోని కొందరు ఉ­ద్యోగులు జీతాల చెల్లింపులపై గవర్నర్‌కు ఫిర్యా­దు చేసిన విషయంపై దత్తాత్రేయ స్పందిస్తూ.. ఈ విషయంలో గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. గవర్నర్‌ దృష్టికి వచ్చిన ప్రతి విషయం తిరిగి ప్రభుత్వానికే పంపించాలని, కేవలం పరిశీలించమని చెప్పే అధికారం మాత్రమే గవర్నర్‌కు ఉందని వ్యాఖ్యానించారు. కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీని అమలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానన్నారు. 

శారదాపీఠంలో వేద పోషణ అభినందనీయం 
వేద పోషణ కోసం విశాఖ శ్రీశారదా పీఠం శ్రమిస్తున్న తీరు అభినందనీయమని బండారు దత్తాత్రేయ తెలిపారు. శారదాపీఠం వార్షికోత్సవాలు నాల్గవరోజైన సోమవారం వైభవంగా జరిగాయి. ఈవేడుకల్లో  దత్తాత్రేయ పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల యాగంలోను, శ్రీనివాస చతుర్వేద హవనంలోను పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్భంగా శారదాపీఠం ముద్రించిన మాండుక్యోపనిషత్‌ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఠం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రసంశనీయమన్నారు. దత్తాత్రేయ వెంట ఎమ్మెల్సీ మాధవ్‌ ఉన్నారు. కాగా, వార్షికోత్సవాల్లో భాగంగా శారదాపీఠంలో సాయంత్రం జరిగిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. 

మరిన్ని వార్తలు