రాత్రంతా కూర్చుంటా.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

6 Jan, 2023 20:31 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పరామర్శించారు. రాములు కుటుంబానికి అండగా ఉంటామని బండి సంజయ్‌ భరోసా ఇచ్చారు.

‘‘రాములు ఆత్మహత్య అందరినీ కలచివేసిందన్నారు. రాములు రైతు కాదని ఎలా చెబుతారని బండి సంజయ్‌ ప్రశ్నించారు. రాములుకు రెండెకరాల భూమి ఉంది. రైతుల ప్రయోజనాలు ప్రభుత్వానికి పట్టవా?. కేసీఆర్‌ పాలనలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు’’ అని బండి సంజయ్‌ అన్నారు.

‘‘తెలంగాణలో రైతులను వదిలేసి దేశంలో రైతులను ఉద్దరిస్తారా?. కేసీఆర్‌, కేటీఆర్‌ భూములపై పడ్డారు. మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో భూముల కబ్జా చేస్తున్నారు’’ అని బండి సంజయ్‌ మండిపడ్డారు. ‘‘కలెక్టర్‌ నిర్లక్ష్యం వల్లే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. రాములుది ప్రభుత్వ హత్యే. కామారెడ్డి కలెక్టర్‌ ఎందుకు రారో చూస్తా. రాత్రంతా కలెక్టరేట్‌ ఎదుటే కూర్చుంటా. కేటీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ మంత్రిగా మారారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని బండి సంజయ్‌ అన్నారు.

బండి సంజయ్‌ అరెస్ట్‌
​కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు​- పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
 

మరిన్ని వార్తలు