ఏ ముఖం పెట్టుకుని ఓయూ వెళతారు? 

5 May, 2022 05:37 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం ధర్మాపూర్‌ రచ్చబండలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

రాహుల్‌పై బండి సంజయ్‌ ధ్వజం 

సాక్షి ప్రతినిధి,మహబూబ్‌నగర్‌: ‘రేపో ఎల్లుండో కాంగ్రెస్‌లో ఒకాయన ఢిల్లీ నుండి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి పోతడట... ఆయన ఏ ముఖం పెట్టుకుని పోవా లనుకుంటున్నడు.. తెలంగాణ ఉద్యమంలో 1,400 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయింది కాంగ్రెస్‌ పాలనలోనే కదా.. ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే.. అంతమంది ప్రాణాలు పోయేవి కాదు కదా.. అయినా సిగ్గు లేకుండా ఉస్మానియాకు ఎందుకు వస్తున్నట్లు?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. సంజయ్‌ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర 21వ రోజు బుధవారం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా పాదయాత్ర, రచ్చబండలో బండి మాట్లాడారు.  

రైతన్నలను ఆదుకోవాలి 
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తా నన్న కేసీఆర్‌ హామీలు మాటలుగానే మిగిలిపోయాయని సంజయ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో, మంగళవారం కురిసిన అకాల వర్షాల కారణంగా రైతాంగం నష్టపోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ తీరుతో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బండి పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. నీతి, నిజాయతీతో కూడిన పాలన అందించేది ఒక్క బీజేపీ మాత్రమే అని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు