విద్యార్థుల జీవితాలతో చెలగాటం

7 Apr, 2023 04:15 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్‌ ఆగ్రహం 

గతంలో ఇంటర్, ఇప్పుడు టెన్త్‌ విద్యార్థుల వంతు

బీజేపీకి ఆదరణ ఓర్వలేకే కుట్రలు 

జైలు నుంచి కార్యకర్తలకు బండి సంజయ్‌ బహిరంగ లేఖ 

ప్రధాని సభను విజయవంతం చేయాలని పిలుపు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, గతంలో ఇంటర్‌ విద్యార్థులతో, తాజాగా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు కుట్రలకు తెరలేపాయని పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను విమర్శించారు.

తనపై మోపిన పేపర్‌ లీకేజీ కేసు ఆ కుట్రలో భాగమే అని విమర్శించారు.ఇది అత్యంత క్లిష్ట సమయమని, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ కుట్రలకు భయపడితే 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల జీవితాలు ప్రమాదంలో పడ్డట్లేనన్నారు.

టెన్త్‌ పేపర్ల లీకేజీకి కుట్ర కేసులో ప్రస్తుతం కరీంనగర్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంజయ్‌.. గురువారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కారాగారం నుంచే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. తొలుత పార్టీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండి.. పార్టీ నిర్మాణం కోసం శ్రమించిన వాజ్‌పేయి, డీఎన్‌ రెడ్డి మొదలు చలపతిరావు, రామారావు, టైగర్‌ నరేంద్ర, జితేందర్‌రెడ్డిల సేవలను స్మరించుకున్నారు.  

నిరుద్యోగుల పక్షాన గళమెత్తినందుకే.. 
కేసులు, జైళ్లు కొత్తకాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు,  ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సంజయ్‌ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను, ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్‌ కొడుకు పాత్రను ఎత్తిచూపుతూ 30 లక్షల మంది నిరుద్యోగ కుటుంబాల పక్షాన గళమెత్తినందుకే తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. నాడు తన స్వార్థం కోసం 27 మంది ఇంటర్మీ డియట్‌ విద్యార్థులను ప్రభుత్వం బలి తీసుకుందని మండిపడ్డారు.  

ప్రధాని మోదీ నాకు స్ఫూర్తి 
ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అని, ఆయన ఈనెల 8న హైదరాబాద్‌కు వస్తున్నా తాను ఆ సభకు హాజరయ్యే అవకాశం కన్పించకపోవడంతో బాధగా ఉందని సంజయ్‌ పేర్కొన్నారు. మోదీ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. శ్యామ్‌ప్రసాద్‌.. దీన్‌ దయాళ్‌ సిద్ధాంతాలు, వాజ్‌పేయి త్యాగం, మోదీ ఆశలను నెరవేర్చేందుకు కృషి చేయాలని, కేసీఆర్‌ సర్కార్‌ను బొందపెట్టడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 

బిడ్డ, కొడుకుల స్కాంలు బయటపడుతున్నాయి.. 
బిడ్డ, కొడుకు చేసిన స్కాంలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నిస్పృహలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తనను అరెస్టు చేసి జైలుకు పంపడం ద్వారా ఉద్యమాలను అడ్డుకోవాలని చూస్తోందని సంజయ్‌ ఆరోపించారు. జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. 

ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి 
టీఎస్‌పీఎస్సీ లీకేజీకి బాధ్యుడైన కేసీఆర్‌ కొడుకును కేబినెట్‌ నుండి బర్తరఫ్‌ చేసేవరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు, లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ చీఫ్‌ పిలుపునిచ్చారు. నియంత పాలనకు చరమ గీతం పాడేదాకా పోరాడదామని అన్నారు.

‘గడీల్లో బందీ అయి విలపిస్తున్న తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే మనందరి లక్ష్యం. అందుకోసం తెగించి కొట్లాడదాం.. రాబందుల రాజకీయ క్రీడ నుండి తెలంగాణ తల్లిని రక్షించుకుందాం. అందుకోసం మీరంతా కదిలిరండి..’అని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు