బస్‌చార్జీలు పెంచితే ఊరుకోం 

23 Sep, 2021 01:45 IST|Sakshi
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో మహిళల సమస్యలు వింటున్న బండి సంజయ్‌

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

సాక్షి, కామారెడ్డి: పేదల రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ చార్జీలను పెంచితే ఊరుకోబోమని, పెంపుదలను అడ్డుకునేందుకు బీజేపీ ఎంతదాకైనా పోరాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 26వ రోజైన బుధవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. ఒక్కో లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ.40 దోచుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఆ పన్నుల ను త్యాగం చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్‌ చార్జీల సాకుతో బస్‌చార్జీల భారం మోపేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఆర్టీసీ కార్మికులకు జీతాలు కూడా ఇవ్వని ముఖ్యమంత్రి ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన విద్యుత్తు చార్జీలను అడ్డగోలుగా పెంచడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. విద్యుత్తు, బస్‌చార్జీల పెంపుదల ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఈ సభకు ము ఖ్యఅతిథిగా హాజరైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ రేఖావర్మ మాట్లాడుతూ తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళలు, బాలికలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సభలో మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, మాజీ జెడ్పీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి మాట్లాడారు. పాదయాత్రలో ఆ పార్టీ నేతలు మనోహర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.    

>
మరిన్ని వార్తలు