ట్విటర్‌ టిల్లును ముఖ్యమంత్రి చేయాలనే ఇదంతా: బండి సంజయ్‌

6 Oct, 2022 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ జాతీయ పార్టీకి జెండా.. ఎజెండా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. గతంలో ఫ్రంట్‌ అన్నాడు.. ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నాడని విమర్శించారు. భారత్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టారు కానీ దాని అర్థం ఏంటో కూడా తనకు తెలియడం లేదని అన్నారు. జాతీయ పార్టీ పేరులో రాష్ట్రం అనేది ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ చెల్లని రూపాయి అని దుయ్యబట్టారు. ట్విటర్‌ టిల్లును ముఖ్యమంత్రి.. లిక్కర్‌ క్వీన్‌కు ఢిల్లీలో ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేయాలని జాతీయ పార్టీ పెట్టాడని మండిపడ్డారు. 

‘కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. బీఆర్ఎస్ పార్టీ పేరు కూడా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు తెలియడం లేదు. విమానాలు ఉన్నది ఇద్దరికే. ఒకటి కేఏ పాల్, రెండు కేసీఆర్.. ఇద్దరూ ఒకటే కేటగిరీ. మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి. ప్రజలు ఓట్లు వేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి.. దానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ అని ఎలా పెడతావు. ఎమ్మెల్యే పార్టీ మారితేనే రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. మరి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా మొత్తం పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పేరుతో పోటీ చేయాలి. 
చదవండి: నా భార్య సైతం ఇన్ని ‘లవ్‌ లెటర్స్‌’ రాయలేదు: కేజ్రీవాల్‌

ముందు తెలంగాణ కు ఏం చేస్తావో చెప్పు. ఎంఐఎం, సీపీఐ లాంటి జాతీయ పార్టీలు బోలెడున్నాయి. వాటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. పార్టీ ప్రకటిస్తే కార్యక్రమానికి వచ్చిందెవరు. కేసీఆర్ ది.. నోరా.. మోరీనా.. లింగ వివక్ష లేకుండా చేస్తా అని ఇప్పుడు అంటున్నారు. నీ కేబినెట్‌లో ఎందరు మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో వరి వేస్తే ఉరి అన్నాడు.. దేశంలో గోధుమ పండిస్తే గొయ్యి.. నువ్వులు వేస్తే నుయ్యి అంటాడేమో.. గుణం లేని వ్యక్తి గుణాత్మక మార్పు గురించి మాట్లాడుతున్నాడు. బయట పార్టీలన్ని కిరాయి పార్టీలు అన్నావ్.. ఇప్పుడు ఎలా జాతీయ పార్టీ పెడ్తున్నావ్. ప్రపంచమంతా కేసీఆర్‌ను చూసి భయపడుతోంది. ప్రపంచ రాజ్య సమితి పెడితే ఎలా అని అందరూ భయపడుతున్నారు. 

కొడుకు, బిడ్డలు అక్రమంగా సంపాదించుకున్నారని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఇంకా బయటపడుతున్నాయి. ఇంట్లో ఇప్పటికే గొడవలు సాగుతున్నాయి. పార్టీలో అసమ్మతి మొదలయింది. వారికి, ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి. ముస్లిం, మైనారిటీ ఓట్లు అన్ని ఎక్కడున్నాయో చూసుకుని ఆ ప్రాంతాల్లో ఎంఐఎంతో కలిసి పోటీ చేయాలని ఇద్దరు మంత్రులతో కేసీఆర్ చెప్పారట. ప్రధానిగా ఎవరిని చేస్తారో? ప్రగతి భవన్‌లో కీమా, బిర్యానీ పెట్టి అందరినీ మోసం చేస్తున్నాడు. మొన్నటి వరకు కేసీఆర్ వడ్డించాడు.. ఇప్పుడు కేటీఆర్ వడ్డిస్తున్నాడు’ అని బండి సంజయ్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు