రేషన్‌ బియ్యం స్కాం బట్టబయలు చేస్తాం

2 May, 2022 04:45 IST|Sakshi
ధన్వాడలో మహిళలతో మాట్లాడుతున్న బండి సంజయ్‌

రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ 

నారాయణపేట: రేషన్‌ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కుంభకోణాన్ని బట్టబయలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర 18వ రోజు ఆదివారం నారాయణపేట జిల్లాలోని అంత్వార్‌స్టేజీ, కొల్లంపల్లి, లింగపల్లి, ధన్వాడలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రజలను, బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులేనని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న అరాచకాలకు తగిన బుద్ధి చెబుతామని బండి హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కోయిల్‌సాగర్‌ ద్వారా ధన్వాడ చెరువు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ చార్జీలు పెంచి         జనంపై భారాన్ని మోపిన కేసీఆర్‌కు కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు.

అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం నంబర్‌ వన్‌: లక్ష్మణ్‌
అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం నంబర్‌ వన్‌గా నిలిచిందని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మర«థం పడుతున్నారన్నారు. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ కుటుంబం దోచుకోవడం తప్ప ప్రజాసంక్షేమం పట్టడం లేదన్నారు. మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. పాదయాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు