వ్యాక్సిన్ల వృథాలో రాష్ట్రం ముందంజ

9 Jun, 2021 05:54 IST|Sakshi

బండి సంజయ్‌ ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి వచ్చిన 80 లక్షల వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, వ్యాక్సిన్లను వృథా చేయడంలో ముందుందని ఆరోపించారు. ఈ నెలలో మరో 20 లక్షలు, వచ్చే నెలలో 20 లక్షలు, ఆగస్టులో 30 లక్షల వ్యాక్సిన్లు రాబోతున్నాయని, ఇక ప్రతిరోజూ దాదాపు లక్షమందికి వ్యాక్సిన్‌ వేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ స్థాయిలో వ్యాక్సిన్లు వేసే వ్యవస్థే రాష్ట్రంలో లేకుండాపోయిందన్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ స్థాయి వ్యాక్సినేషన్‌కు ఇప్పుడున్న స్టాఫ్‌తోపాటు కనీసం 5 వేలకు తగ్గకుండా డాక్టర్లు, నర్సులు అవసరమని అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణకు ఇస్తానన్న రూ.2,500 కోట్లలో రూ.500 కోట్లు వెచ్చించి పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలన్నారు.  

ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయాలి
రాష్ట్రంలో వెంటనే ఆయుస్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని, ఆరోగ్యశ్రీలో కరోనాకు చికిత్స అదించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. వ్యాక్సినేషన్‌పై అవగాహన లేని రాష్ట్రమంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, హరీశ్‌రావు సిద్దిపేటలో, కేటీఆరేమో ట్విట్టర్‌లో కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించగానే ఇతర రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలియజేశారని, తెలంగాణ సీఎం మాత్రం స్పందించలేదని, అదీ ఆయన సంస్కారమని ఎద్దేవా చేశారు. ఫ్రీ వ్యాక్సిన్‌ కారణంగా రూ.2,500 కోట్లలో తమకు వచ్చే కమీషన్లు పోయాయనే బాధతోనే ప్రధానికి కేసీఆర్‌ కృతజ్ఞతలు చెప్పలేదన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చేసిన అవినీతిని బయట పెడతామని హెచ్చరించారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేరాలని అడగడం కాకుండా, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని చెప్పారంటే కాంగ్రెస్‌ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. రమణ టీఆర్‌ఎస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదన్నారు.   

మరిన్ని వార్తలు