సంజయ్‌... జిల్లా నేతలకు ‘జై’ 

3 Aug, 2020 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ‘బండి’కూర్పులో కొంచెం మార్పు, కొంచెం నేర్పు కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటులో అధ్యక్షుడు బండి సంజయ్‌ తనదైన ముద్ర వేశారు. జిల్లాల నేతలకు సం‘జై’కొట్టారు. హైదరాబాద్‌లో ఉంటున్నవారికే ఇప్పటిదాకా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలకు చెక్‌ పెట్టారు. ఈసారి ఆయా జిల్లాల నేతలకు రాష్ట్ర కమిటీలో ఎక్కువ పదవులు కేటాయించారు. రాష్ట్రకమిటీలో మొత్తంగా 23 మందికి చోటు కల్పించగా అందులో 17 మంది జిల్లాల నేతలే కావడం గమనార్హం.

సంజయ్‌ స్వయంగా కరీంనగర్‌ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అధికార ప్రతినిధుల్లో నల్లగొండ నుంచి పి.రజనీకుమారికి స్థానం కల్పించారు. కమిటీలో మాజీ ఎమ్మెల్యేలకు కూడా పెద్దపీట వేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కూడా కమలదళంలో చోటు లభించింది. 8 మంది ఉపాధ్యక్షుల్లో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, సెక్రటరీల్లో ఒక మాజీ ఎమ్మెల్యేకు స్థానం కల్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన విజయరామారావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శోభారాణికి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రేమేందర్‌ రెడ్డి, ప్రదీప్‌కుమార్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. బీజేపీ జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కూతురు బంగారు శృతికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చింది. రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన వారిలో శ్రీనివాస్‌ గౌడ్, కుంజా సత్యవతి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కాగా ప్రకాష్‌రెడ్డి, రఘునందన్‌ రావు, మాధవి ఇప్పటివరకు అధికార ప్రతినిధులుగా పనిచేశారు. మరో కార్యదర్శి బొమ్మ జయశ్రీ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కూతురు. ఇక గత కమిటీలో పనిచేసిన కార్యదర్శులలో మళ్లీ ఎవరికీ చాన్స్‌ దక్కలేదు. పార్టీ కోశాధికారిగా గత కమిటీలో ఉన్న శాంతికుమార్‌నే మళ్లీ నియమించారు. నార్త్‌ ఇండియన్‌ భవర్‌లాల్‌ వర్మను జాయింట్‌ ట్రెజరర్‌గా నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిని మార్పు చేశారు. 

ఆరుగురు మహిళలకు చోటు... 
బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. ఉపాధ్యక్షులుగా ఒకరికి, ప్రధాన కార్యదర్శిగా మరొకరికి, కార్యదర్శుల్లో నలుగురికి స్థానం దక్కింది. సామాజికవర్గాల వారీగా చూస్తే రాష్ట్ర కమిటీలో అగ్రకులాలవారికే ఎక్కువ చోటు దక్కింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆరుగురు, వెలమ ముగ్గురు, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. బీసీల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అధ్యక్షునితో కలుపపుకొని నలుగురు ఉన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా