శ్రీలంకలా తెలంగాణలో పాలన 

15 May, 2022 04:47 IST|Sakshi
తుక్కుగూడ సభలో భావోద్వేగంతో ప్రసంగిస్తున్న బండి సంజయ్‌

అక్కడ కుటుంబ పాలనతో ప్రజలకు చిప్ప చేతికిచ్చారు: బండి సంజయ్‌ 

అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు.. ఉచిత విద్య, వైద్యం.. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కుటుంబ పాలనతో శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రజలకు చిప్ప చేతికి వచ్చింది. తెలంగాణలోనూ అదే తరహా పాలన కొనసాగుతోంది. ప్రజలపై లక్షలకొద్దీ తల సరి అప్పు మిగిల్చారు. ఏకపక్ష విధానాలు, ప్రజావ్యతిరేక పాలనతో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచేశారు..’’అని టీఆర్‌ఎస్, కేసీఆర్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ, అవి నీతి, నియంతృత్వ పాలన రాజ్యమేలుతోం దని విమర్శించారు. ప్రధాన శాఖలన్నీ కేసీఆర్‌ కుటుంబం పరిధిలోనే పెట్టుకున్నారని.. కేసీఆర్‌కు ఇష్టమైన ఒక్క ఎక్సైజ్‌ శాఖను మాత్రమే మరొకరికి ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. శనివారం తుక్కుగూడలో జరిగిన సభలో బండి సంజయ్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

పేదలందరికీ ఇళ్లిస్తాం..: ‘‘బీజేపీకి ప్రజల మద్దతు కోరేందుకే ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహి స్తున్నాం. యాత్రలో నడిచింది నేనే.. కానీ నడిపించింది మాత్రం ప్రజలు, కార్యకర్తలే. పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అడుగడుగునా సమస్యలు కని పించాయి. నాకు అందిన 18, 19 వేల వినతిపత్రాల్లో 60% ఇళ్లులేని పేదలు, దళితులు, అణగా రిన వర్గాల సమస్యలవే ఉన్నాయి.

నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే పీఎం ఆవాస్‌ యోజన కింద అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ప్రభుత్వంలో ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. ఏటా జాబ్‌ కేలండర్‌ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతాం. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి ప్రజలకు వెసులుబాటు కల్పిస్తాం. అర్హులైన పేదలకు ఉచిత విద్య, వైద్యం తప్పనిసరిగా అందజేస్తాం. ఫసల్‌ బీమా ద్వారా రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటాం. 

ఎగిరేది కాషాయ జెండానే..: నిజాం సమాధి వద్ద మోకరిల్లిన, ఔరంగజేబు సమాధి వద్ద నివాళు లు అర్పించిన ఒవైసీలకు మద్దతునిస్తున్న చరిత్ర టీఆర్‌ఎస్‌ది. తెలంగాణ గడ్డపై ఇక ఎగిరేది కమలం పార్టీ జెండానే. తెగించి కొట్లాడి గొల్లకొండ కోట మీద కాషాయజెండాను రెపరెపలాడిస్తాం. టీఆర్‌ ఎస్, కాంగ్రెస్‌ రెండూ ఒకటే. ఎన్నికల దాకా డ్రామాలాడుతాయి. కాంగ్రెస్‌ వారిని గెలిపిస్తే మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరుతారు. ఇప్పటిదాకా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు అవకాశమిచ్చారు. ఒక్కసారి బీజేపీని గెలిపించండి. కష్టపడి, ఇష్టపడి మోదీ పథకాలను, సుపరిపాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తాం’’అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు