‘దమ్ముంటే కేసీఆర్‌ ఆధారాలు చూపించాలి’

9 Nov, 2021 03:32 IST|Sakshi

గంటసేపు అబద్ధాలే..

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ధ్వజం

సీఎం పదవిని దిగజార్చారు..

అబద్ధాలకే ఒక శాఖ.. దానికి మేనల్లుడే మంత్రి అని ఎద్దేవా

మెడలు ఎప్పుడు నరుకుతారో చెబితే వస్తానన్న సంజయ్‌

Bandi Sanjay Open Challenge to CM KCR: సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవిని, గౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగజార్చా రని, ఆదివారం ప్రెస్‌మీట్‌లో సీఎం స్థాయి వ్యక్తి గంటసేపు అబద్ధాలు వల్లించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సం జయ్‌ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ అబద్ధా లకే ఒక శాఖని పెట్టుకున్నారని, దానికి మేనల్లుడు హరీశ్‌రావును మంత్రిగా పెట్టు కున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు వల్లిం చేందుకే ప్లీనరీలు, సభలు, కేబినెట్‌ భేటీలు పెడుతున్నారంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. తెలంగాణ రాష్ట్రం కోసం, రైతుల కోసం కేసీఆర్‌ ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏడేళ్లుగా కృష్ణాజలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్‌ అన్యాయం చేశారని మండిపడ్డారు. ‘ఏడేళ్ల నుంచి కేంద్రమే ధాన్యం కొన్నదని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.. అప్పుడు కేంద్రం గురించి మాట్లాడుదాం’అని అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లతో కలసి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా కేసీఆర్‌ తీరు మారలేదని అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీపై సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వాటికి సమాధానంగా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బండి సంజయ్‌ మాట్లాడారు. ‘కేసీఆర్‌ కుంగుబాటుకు గురయ్యారు. ఏదేదో మాట్లాడుతున్నారు.

బీజేపీ ఎక్కడుందంటూ కేసీఆర్‌ అహంకారంతో మాట్లాడితే జీహెచ్‌ఎంసీలో నాలుగు సీట్ల నుంచి 48 సీట్లకు తీసుకువెళ్లాం. ఇప్పుడు హుజూరాబాద్‌లో గెలిచాం, అంతకు ముందు దుబ్బాకలోనూ గెలిచాం. కేసీఆర్‌ ఎప్పుడు మెడలు నరుకుతారో చెబితే వస్తాను. నక్సలైట్లు చంపుతామన్నా భయపడలేదు. జైలుకు వెళ్లి వచ్చాం. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశాం. కేసీఆర్‌ హద్దుల్లో వుండి మాట్లాడాలి. హద్దు మీరొద్దు’అని బండి దీటుగా స్పందించారు. ‘62 లక్ష ఎకరాల్లో వరి సాగైందని చెప్పారు, చూపెడతారా. ప్రతిగింజా నేనే కొంటా. కేంద్రం చేసేది ఏందని గతంలో కేసీఆర్‌ మాట్లాడారు’అని సంజయ్‌ గుర్తుచేశారు. 

కేసీఆర్‌ దేశద్రోహి...
‘చైనా–అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. దేశం ప్రశాంతంగా ఉండటం కేసీఆర్‌కి ఇష్టం లేదు. అగ్గి రాజేస్తారట. కేసీఆర్‌ దేశద్రోహి. కేసీఆర్‌ పరోక్షంగా చైనాకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్‌. పక్క రాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేకపోయారు. రైతు చట్టాలపై ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తా అని గతంలో వెళ్లారు.. ఏం చేశారు? ఇప్పుడు కూడా ఢిల్లీకి వెళ్లి గడ్డి పీకు పో, రైతు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ అని అంటే, కేసీఆర్‌ని ఎవరూ పట్టించుకోలేదు’అని వ్యాఖ్యానించారు.

వ్యాట్‌ పెంచింది కేసీఆర్‌...
‘2015లో పెట్రోల్‌ మీద నాలుగు శాతం, డీజిల్‌ మీద 5 శాతం వ్యాట్‌ పెంచింది తెలంగాణ ప్రభుత్వమే. ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌ ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించదు. దేశంలో అత్యధికంగా వ్యాట్‌ వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది రెండోస్థానం. రీజినల్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు ఇచ్చింది కేంద్రం కాదా.. గొర్రెలు, బర్రెల పైసలు కూడా కేంద్రానివే. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 299 టీఎంసీల వాటా కావాలని కేసీఆర్‌ నాలుగుసార్లు సంతకాలు ఎందుకు పెట్టారో, అపెక్స్‌ సమావేశాలకు ఎందుకు వెళ్లారో చెప్పాలి. 80 వేల పుస్తకాలు చదివి కేసీఆర్‌ ఏం నేర్చుకున్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తానని మోసం చేయడం నేర్చుకున్నారా.. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తానని మోసం చేయడం నేర్చుకున్నారా.. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది మర్చిపోతమా. ప్రజలు కేసీఆర్‌ను నమ్మేస్థితిలో లేరు. కేసీఆర్‌ అంకుల్‌కి కోపం వచ్చింది. గురువుగారు భయపడుతున్నారు. బూతు భాషా కోవిదుడయ్యారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు శ్రీశ్రీశ్రీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని దిగజార్చారు. నోరు తెరిస్తే అబద్ధాలు’అని సంజయ్‌ ధ్వజమెత్తారు.  
 

మరిన్ని వార్తలు