కేసీఆర్‌లో భయం, అసహనం మొదలైంది.. 

21 Aug, 2022 03:00 IST|Sakshi

మునుగోడు ఉపఎన్నికతో టీఆర్‌ఎస్‌ పతనం ఖాయం 

ప్రజాసంగ్రామయాత్రలో బండి సంజయ్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌/రఘునాథపల్లి/సాక్షి, హైదరాబాద్‌: మునుగోడులో సీఎం కేసీఆర్‌ ప్రసంగం వింటే ఆయన గొంతులో వణుకు, మాటల్లో అసహనం, భయం కనిపించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సభ అట్టర్‌ప్లాప్‌ అయిందని,  టీఆర్‌ఎస్‌ పతనం ఖాయమని స్పష్టమైందన్నారు. ప్రజా సంగ్రామయాత్ర శనివారం రాత్రి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మీదికొండకు చేరింది.

అక్కడ నిర్వహించిన సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ మునుగోడులో సీఎం కేసీఆర్‌ తొప్పాస్‌ సభను నిర్వహించారని ఎద్దేవాచేశారు. భయంతో చిన్నమెదడు చితికి చిన్నాపెద్దా తేడా లేకుండా పీఎం, కేంద్ర హోంమంత్రిపై అవాకులు చవాకులు పేలారని విమర్శించారు. సీఎం హోదాలో ఉండి మాట్లాడే భాషేనా అని, ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ చీదరించుకున్నారన్నారు.

కృష్ణాజలాల వాటా రాకపోవడానికి  కేసీఆర్‌ కారణమని, మోదీ, అమిత్‌షా గురించి మాట జారితే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపి మరోసారి కరెంట్‌ చార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజాసంగ్రామ యాత్ర శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మీదికొండకు చేరుకున్న సందర్భంగా ఆయన ఖిలాషాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్‌ తీరుతో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రూ.60 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. బకాయిలు చెల్లించకుంటే కరెంట్‌ ఉత్పత్తి సంస్థలు మూతపడే పరిస్థితి ఉందని, అదే జరిగితే రాష్ట్రంలో అంధకారం నెలకొనే ప్రమాదముందన్నారు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకే పవర్‌ ఎక్సే్ఛంజీల వద్ద విద్యుత్‌ కొనుగోలును కేంద్రం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ప్రజలకు పొర్లుదండాలు పెట్టినా ఆ పార్టీకి ఓటేయరని చెప్పారు. ఆదివారం మునుగోడులో జరిగే అమిత్‌షా సభను విజయవంతం చేయాలని కోరారు. 

ప్రతి ఇంటికీ నల్లా నీళ్లిస్తున్నట్టు తీర్మానం చేయించే దమ్ముందా? 
మిషన్‌ భగీరథ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాఖ్యలన్నీ బూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. తెలంగాణలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తున్నట్లు తీర్మానం చేయించి పంపే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. చాలాగ్రామాల్లో ఇప్పటికీ నల్లా కనెక్షన్‌ లేని ఇళ్లు వేలల్లో ఉన్నాయన్నారు. హర్‌ ఘర్‌ జల్‌ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ప్రచారాన్ని బండి సంజయ్‌ శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. 

చదవండి: మునుగోడుకు  క్యూ! 

మరిన్ని వార్తలు