లై డిటెక్టర్‌ పరీక్షకు కేసీఆర్‌ సిద్ధమా?.. కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌!

28 Oct, 2022 17:41 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: తెలంగాణ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవుడి సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. ఈ అంశంపై బీజేపీకి, తనకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. 

అనంతరం, మీడియాతో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కడున్నాయి.. బ్యాగ్‌లు ఏవి?. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు సీఎం కేసీఆరే సూత్రధారి. అవన్నీ ఫేక్‌ వీడియోలే. లై డిటెక్టర్‌ పరీక్షకు కేసీఆర్‌ సిద్ధమా?. కేసీఆర్‌కు దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. నిజంగా ఆధారాలుంటే కోర్టుకు ఎందుకు సమర్పించలేదు?. మునుగోడు ఎన్నికల్లో మందు, మనీ, మాంసం పంచినా, ఓటుకు రూ.40 వేలు పంచినా, ఓటుకు తులం బంగారం ఇచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితి లేదని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఈ కారణంగానే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కుట్రలకు తెరలేపాడు. కేసీఆర్‌కు సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దుస్ధితి ఏర్పడింది. మునుగోడు ఫలితాల తరువాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపారు.

ఆ స్వామిజీ ఎవరో నాకు తెలియదు. బాధితులు టీఆర్ఎస్ పార్టీ నేతలే. పైసలకు అమ్ముడుపోయేందుకు సిద్ధమైంది కూడా వాళ్లే. డబ్బు తీసుకొచ్చిన వాహనాలు టీఆర్ఎస్ నేతలవే. ఇందులో బీజేపీకి సంబంధం లేకపోయినా బురదచల్లి రాజకీయ లబ్ది పొందే కుట్రకు కేసీఆర్ తెరదీశాడు. ఆడియో టేపుల పేరుతో మరో కొత్త సినిమా చూపే యత్నం చేసి కేసీఆర్ ఫెయిల్‌ అయ్యాడు. అసలు ఆ ఎమ్మెల్యేలు ఎటు వెళ్లారు? మూడు రోజులుగా కనిపించడంలేదు. బయటకు ఎందుకు రావడం లేదు? ప్రగతి భవన్‌కే పరిమితం చేశారా? అంటూ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు