కేసీఆర్‌ పెద్ద తోపేం కాదు: బండి సంజయ్‌

5 Jan, 2021 20:23 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని తాగి నడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో మంగళవారం జరిగిన బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మేయర్ ఎన్నిక ఎందుకు జరపడం లేదని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ముందస్తు షెడ్యూల్ ఎందుకు పెట్టలేదని, బీజేపీని చూస్తే కేసీఆర్‌కు భయమేస్తోందన్నారు. కేసీఆర్ పెద్ద తోపేం కాదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. వరంగల్‌లో వరదలు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. హైదరాబాద్ వరద బాధితులకు పదివేలు ఇచ్చిన కేసీఆర్ వరంగల్‌లో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. చదవండి: ఉపాధ్యాయులపై కేసీఆర్‌ వివక్ష: బండి సంజయ్‌

‘కేసీఆర్ దగుల్ బాజీ ముఖ్యమంత్రి, బడాచోర్ ముఖ్యమంత్రి. హైదరాబాద్‌లో జరిగినట్టే వరంగల్‌లోనూ జరగబోతోంది. వరంగల్‌లో బీజేపీ గెలవబోతోంది. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. అందుకే వరంగల్‌‌లో న్నికలు పెట్టడం లేదు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది కేవలం 40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వరంగల్ అభివృద్ధిపై భద్రకాళీ టెంపుల్‌లో ప్రమాణానికి వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్ధమా. వరంగల్‌లో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది..? తెలంగాణలో ప్రమోషన్లు లేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.’ అని పేర్కొన్నారు. ఈ సభకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల బీజేపీ ఇంఛార్జి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు