ప్రగతి భవన్‌ నుంచి గుంజుకొస్తాం

11 Jul, 2021 01:12 IST|Sakshi

సీఎంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలు 

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఎందుకు రాకూడదు? 

ఆగస్టు 9 నుంచి పాదయాత్ర  

బాల్కొండ: రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌ నుంచి బయటకు గుంజుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రగతి భవన్‌ వదిలి బయటకు రాని కేసీఆర్‌ను సరైన సమయంలో బయటకు గుంజుకొస్తామన్నారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే.. రాష్ట్రమే డబ్బులు ఇస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ సరఫరా చేస్తున్నారన్నారు.

కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు రూ.2,500 కోట్లు కేటాయిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు స్టాఫ్‌ నర్సులు, హెల్త్‌ అసిస్టెంట్‌లను ఎలా తొలిగిస్తారని ప్రశ్నించారు. బీజేపీ మతతత్వ పార్టీ అనే వారికి ట్రిపుల్‌ తలక్‌ రద్దు చెంప పెట్టు అన్నారు. బీజేపీ హిందూ మతతత్వ పార్టీ అయితే ముస్లింల గురించి ఎందుకు ఆలోచన చేస్తుందని ప్రశ్నించారు. 80 శాతం హిందువులు ఉన్న తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి ఎందుకు రాకూడదన్నారు. బీజేపీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త ఐక్యమత్యంగా ముందుకు సాగలన్నారు. ఆగస్టు 9 నుంచి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.  

సీఎం, మంత్రులు గజ దొంగలు 
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు గజదొంగలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. వరి, మక్క పంటలను కొనుగోలు చేయడం చేతకాని సీఎం, పసుపు రైతుల గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. ఉప ఎన్నికలు రాగానే అభివృద్ధి అంటూ ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై ప్రజలు చెప్పులు విసిరే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

నిరుద్యోగులను మోసగిస్తే ఊరుకోం..  
సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగులకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు వేతనాలిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం దిగజార్చారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు రాక అల్లాడుతున్న నిరుద్యోగులను మోసం చేస్తే  సర్కార్‌ భరతం పడతామని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు