అబద్ధాల పునాదులపై కేసీఆర్‌ పాలన

13 Sep, 2021 04:17 IST|Sakshi
రంగంపేట సభలో మాట్లాడుతున్న బండి సంజయ్‌. చిత్రంలో విజయశాంతి

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ 

కొల్చారం, చిలప్‌చెడ్‌ (నర్సాపూర్‌): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆదివారం మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలంలోని చాముండేశ్వరీ ఆలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేయించి, అక్కడి నుంచి ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగించారు. చిట్కుల్‌లో కుమ్మర సంఘం సభ్యుల కోరిక మేరకు కుమ్మరి సారె తిప్పి కుండను తయారు చేశారు. అనంతరం ఎస్సీ మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తమకు మూడు ఎకరాలు భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రాలేదని వారు సంజయ్‌కు వివరించారు.

అనంతరం కొల్చారం మండలం రంగంపేటలో ఏర్పాటు చేసిన సభలో సంజయ్‌ మాట్లాడుతూ పీఎం ఆవాస్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపడుతుంటే సీఎం కేసీఆర్‌ మాత్రం డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఆ దిశగా ఇప్పటికీ చర్య తీసుకోకుండా రైతులను మోసం చేస్తున్నారన్నారు.

అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటే రైతులకు నష్టపరిహారం మాట అటుంచి, కనీసం వారిని పలకరించే నాథుడే లేరని విచారం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసి, ఒక్కో వ్యక్తి మీద లక్ష రూపాయల భారం మోపిన ఘనుడు కేసీఆర్‌ అని ఆయన విమర్శించారు. వచ్చే రెండేళ్లల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రజలు కూడా తమ పార్టీ వైపు ఉన్నారన్నారు. యాత్రలో మెదక్‌ మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.  

విమోచన దినోత్సవాన్ని నిర్వహించండి 
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ఆదివా రం సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా జాతీయపతాకాన్ని ఎగురవేసి వేడుకలను నిర్వహించాలని కోరారు. తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలని, కేంద్ర ఆర్థికసాయంతో దాని నిర్మాణం చేపట్టి యుద్ధ ప్రాతిపదికన 2022 నాటికి పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. విమోచన ఉద్యమం సందర్భంగా రజాకార్ల చేతిలో బలైనవారి కుటుంబాలను ప్రభుత్వం సన్మానించాలని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు