హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే బరాబర్‌ అడ్డుకుంటాం

2 Sep, 2021 02:06 IST|Sakshi
పాదయాత్ర సందర్భంగా బుధవారంరాత్రి చేవెళ్లలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు. (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

చేవెళ్లకు చేరిన ప్రజాసంగ్రామ యాత్ర 

చేవెళ్ల: హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని, బరాబర్‌ అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఐదోరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కొనసాగిన సంజయ్‌ పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. సంజయ్‌ మాట్లాడుతూ 12 శాతం ఉన్న ఓట్ల కోసం 80 శాతం ఉన్న హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఓట్ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నపుంసక రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్‌ గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీ అయిందన్నారు. గడీలు బద్దలు కొట్టి కేసీఆర్‌ను గద్దె దించి, తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావ్‌.. చేవెళ్లలో ఐదు మందికైనా ఉద్యోగాలు ఇచ్చావా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాకు మౌలిక సదుపాయలు, ఉపాధి హామీ, మరుగుదొడ్లు వంటి  వాటి కోసం కేంద్రం రూ.1,040 కోట్లు ఇచ్చిందని, చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి రూ.240 కోట్లు ఇచ్చిందని, మరి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమిచ్చిందని ప్రశ్నించారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు పేరుతో ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు. 

కేసీఆర్‌ చేతిలో రాష్ట్రం బందీ...
ఎంతో మంది ప్రాణత్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకుంటే కేసీఆర్‌ అనే మూర్ఖుడి చేతిలో రాష్ట్రం బందీ అయిందని బండి సంజయ్‌ విమర్శించారు. పేదలకు, దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నీ కేంద్రమే ఇస్తోందని చెప్పారు. హిందూ దేవుళ్లను అవమానిస్తే, గోమాతలను నరికితే, హిందువులను నరికి చంపుతామంటే సహించాలా అని సంజయ్‌ ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే రౌడీలుగా కేసులు పెడుతున్నారని, బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేస్తున్నారని బండి ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. చేవెళ్లలో ఇంత పెద్దఎత్తున తరలివచ్చిన జన సందోహానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు సంజయ్‌ చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి రవీంద్రనాయక్, మనోహర్‌రెడ్డి తదితరులు బండి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.  

మరిన్ని వార్తలు