అది తుగ్లక్‌ పార్టీ... ఇది తాలిబన్‌ పార్టీ

10 Sep, 2021 01:38 IST|Sakshi
ప్రసంగిస్తున్న బండి సంజయ్‌. చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు బాబూమోహన్, రవీందర్‌రెడ్డి

టీఆర్‌ఎస్, ఎంఐఎంపై బండి సంజయ్‌ ఫైర్‌ 

వంద కోట్లుంటేనే టీఆర్‌ఎస్‌ టికెట్‌ 

చౌటకూరులో బహిరంగసభ

జోగిపేట (అందోల్‌): రాష్ట్రాన్ని పాలిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ తుగ్లక్‌ పార్టీ అని, ఎంఐఎం తాలిబన్‌ పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. కేసీఆర్‌ తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందన్నారు. భారీ వర్షాలు, వరదలతో లక్షలాది ఎకరాలు పంట నష్టపోయి, ఆస్తి నష్టమై రైతులు, జనం అల్లాడుతున్నా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని చెప్పారు. గురువారం చౌటకూరు మండల కేంద్రంలో ప్రజా సంగ్రామయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘బాబూ మోహన్‌ నన్ను ఎంపీగా గెలిపించేందుకు చాలా కష్టపడ్డారు.

మహారాష్ట్ర సహా ఎక్కడ ఎన్నికలొచ్చినా వెళ్లి ప్రచారం చేసి బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబం వద్దకు ఓ ఎమ్మెల్యే వెళితే ‘పెద్ద మనిషి ఏమైనా పైసలు సంపాదిస్తున్నవా?’అని కేసీఆర్‌ అడిగిండట. ఎక్కడ సార్‌ డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నం అని ఆయన జవాబిస్తే... ప్రభుత్వ భూములు కబ్జా చేసుకో. రూ.100 కోట్లుంటేనే వచ్చే ఎన్నికల్లో సీటిస్తా అని చెప్పిండు. అది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం’అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో రూ.100 కోట్లతో రూములు కట్టుకున్నాడే తప్ప 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని మాత్రం పెట్టలేదని దుయ్యబట్టారు. 

ఉప ఎన్నిక వస్తేనే దళితబంధు
‘ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ దళితబంధు ఎందుకు ఇవ్వడం లేదు? దళితబంధు రావాలంటే ఇక్కడ కూడా ఉప ఎన్నిక రావాల్సిందే. ఉప ఎన్నిక వస్తేనే రోడ్లు వస్తయి.. నీళ్లు వస్తయి.. పథకాలు వస్తాయని జనం చెబుతున్నారు’అని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని, హిందూ సమాజాన్ని చీల్చే పార్టీ ఎంఐఎం అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఎంఐఎం నేతలకు భయపడి సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని జరపడానికి వెనుకాడుతున్న అవకాశవాది కేసీఆర్‌ అని ఆరోపించారు. హిందూ సంఘటిత శక్తిని దేశానికి చాటడమే తన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బాబూ మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, ఏనుగు రవీందర్‌ రెడ్డి, విజయపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు