అది ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి: సంజయ్‌

11 Dec, 2022 01:58 IST|Sakshi
ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న బండి సంజయ్‌ 

ఎమ్మెల్సీ కవితకు సారా దందాతో లింకులున్నాయని ఆరోపణ 

కోరుట్ల/కోరుట్ల రూరల్‌: దొంగసారా దందాతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉన్న లింకులు బయటపడటంతో తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్, అయిలాపూర్, కోరుట్ల మున్సిపాలిటీలో శనివారం కొనసాగిన ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఆయన సీఎం కేసీఆర్,  ఎమ్మెల్సీ కవితపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రూ.లక్ష కోట్ల దొంగసారా దందా చేసిన కేసీఆర్‌ బిడ్డను చూసి దేశమంతా నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. బిడ్డను అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని కేసీఆర్‌ యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో చెల్లని రూపాయిగా మారిన సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం హాస్యాస్పదమన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలు టీఆర్‌ఎస్‌ సంతాప సభలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌ పేరిట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్‌ నేతలతో కలిసి దేశ పర్యటన అంటూ కేసీఆర్‌ అటే వెళ్లిపోతారని, తెలంగాణకు తిరిగిరారని అన్నారు. వేములవాడ, బాసర పుణ్యక్షేత్రాలకు రూ.వంద కోట్ల చొప్పున మంజూరు చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేసీఆర్‌ తాజాగా కొండగట్టుకు రూ.వంద కోట్లు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి ప్రతిఒక్కరి తలపై రూ.1,20,000 భారం వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే రాయితీలను రైతుబంధు పేరిట కాజేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలు క్యాసినోలో పెట్టిన రూ.లక్ష కోట్ల పెట్టుబడుల వ్యవ హారం త్వరలోనే బయటపడుతుందని అన్నారు.  

కేటీఆర్‌ను సీఎం చేయాలని చూస్తున్నారు.. 
టీఆర్‌ఎస్‌లో పరిపాలనాదక్షులు లేరా? సీఎంగా పనిచేయడానికి ఎవరూ పనికిరారా? కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ ఎందుకు ఆలోచిస్తున్నడు? టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారంరాత్రి జరిగిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సభలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు బీజేపీతో కలిసి వచ్చి ప్రగతిభవన్‌ను బద్ధలుకొట్టాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు