Bandi Sanjay: సీఎం సీటే లక్ష్యంగా పావులు కదుపుతున్న బండి.. అక్కడి నుంచే పోటీ!

30 Jan, 2023 19:21 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎక్కడ నుంచి పో­టీ చేస్తారన్న విషయంలో సందిగ్ధత వీడింది. సుదీర్ఘ పాదయాత్రలతో రాష్ట్రమంతటా కలియ చుడుతున్న వేళ.. బండి సంజయ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోటీ చేయాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇలాంటి సమయంలో తా ను పోటీ చేసే స్థానంపై బండి సంజయ్‌ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఆయ న రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన కరీంనగర్‌ నుంచే మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు.

వాస్తవానికి బండి సంజయ్‌ సూర్యాపేట, ఎల్బీనగర్, సనత్‌నగర్, భైంసా, వేములవాడలో ఏదో చోట నుంచి అంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరో ప్రాంతం నుంచిపోటీ చేస్తే.. ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. తన చరిష్మాను కూడా రెండింతలు పెంచుకున్నవారవుతారని పార్టీ సీనియర్లు కూడా అభిప్రాయపడ్డారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. బండి కరీంనగర్‌ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

రహస్య సర్వేల నివేదికలు..
బండి సంజయ్‌ ఈసారి కరీంనగర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఇక్కడ తాను ఉన్నా.. లేకున్నా ఎప్పటికపుడు నియోజకవర్గం సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. మరోవైపు బండి తమ వద్ద పోటీ చేయాలి.. అంటే తమ వద్ద బరిలో నిలవాలి.. అంటూ చాలా డిమాండ్లు మాత్రం ఆగడం లేదు. సంజయ్‌ వేములవాడ నుంచి పోటీ చేస్తారని కొందరు... సిరిసిల్ల నుంచి పోటీ చేస్తారని ఇంకొందరు, హుస్నాబాద్‌ నుంచి చేస్తారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభించిన సమయంలో బండి సంజయ్‌ ఈసారి ముథోల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో బండి తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి..? అన్న విషయంలో కొన్ని సంస్థలతో రహస్య సర్వేలు చేయించుకున్నారని తెలిసింది. సదరు సర్వేలు కరీంనగర్‌లోనే బండికి విజయావకాశాలు ఉన్నాయని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

ఇవే నివేదికలను అధిష్టానం కూడా తెలుసుకుని కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ వంటి దిగ్గజ మంత్రిని ఢీకొట్టాలంటే ప్రత్యర్థిగా బండిని దింపడమే కరెక్ట్‌ అని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే స్వేచ్ఛ బండికి ఉంది. దీనికితోడు గతంలో రెండుసార్లు పోటీ చేసిన అనుభవం, సాంస్కృతిక–రాజకీయ– భౌగోళిక పరిస్థితులపై ఉన్న అవగాహన తనకు కలిసి వస్తాయని బండి బలంగా విశ్వసిస్తున్నారు.

ముందస్తు కోసం ముందుగానే..
వాస్తవానికి కరీంనగర్‌ అసెంబ్లీ నుంచే పోటీ చేయాలన్న కాంక్ష బండిలో బలంగా ఉంది. కరీంనగర్‌ సెగ్మెంటులో మెజారిటీ ఓటింగ్‌ అంతా నగరంలోనే ఉంటుంది. ఎవరైనా ఎమ్మెల్యే కావాలంటే నగర ఓట్లే కీలకం. అందుకే ఇతరులెవరూ కరీంనగర్‌ బీజేపీలో పాతుకుపోయే వీలు లేకుండా పార్టీని కరీంనగర్‌ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్‌ అంటూ విడగొట్టారు. అదే సమయంలో వీలు చిక్కినపుడల్లా ప్రజా సమస్యలపై రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు కరీంనగర్‌ అసెంబ్లీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫిబ్రవరి 17న కొత్త సచి వాలయాన్ని ప్రారంభించిన తరువాత నెలాఖరులోపు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఏ అసెంబ్లీకి ఎవరు పోటీ చేస్తున్నారనే అంశంపై జిల్లా నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తమ నాయకుడు బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచే పోటీ చేస్తారని ఆయన అనుచరులు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే ఇదే విషయాన్ని ఎంపీ బండి సంజయ్‌ వద్ద ప్రస్తావిస్తే మాత్రం.. ‘నేను కేవలం కేసీఆర్‌ సర్కారును దించేందుకు పనిచేస్తున్నా. ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది..’ అంటూ సమాధానం దాటవేయడం గమనార్హం.

బండి పార్టీ నుంచి తాను సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు కరీంనగర్‌ అన్నింటి కంటే అనువైన స్థానంగా భావిస్తున్నారని సమాచారం. తనను ఎంపీగా ఆదరించిన ప్రజలు ఈసారి తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపిస్తారన్న విశ్వాసం బండిలో.. ఆయన వర్గీయుల్లో మెండుగా కనిపిస్తోంది. అందుకే, ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నుంచే ఆయన పావులు కదుపుతున్నారు. 

మరిన్ని వార్తలు