4 సీట్లకు ఎన్నెన్ని పాట్లో!

9 Jun, 2022 08:44 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆధిపత్యం కోసం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో బడా నేతలు రాష్ట్రం నలుమూలలా ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. మరోవైపు సోషల్‌ మీడియా ద్వారానూ ప్రకటనల యుద్ధానికి నాంది పలికారు.  

జూన్‌ 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతంలో సంచరించడం కష్టంగా భావించి సామాజిక మాధ్యమాలపై ఆధారపడ్డారు. ఆడియో, వీడియోలు పంపి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.  

ప్రలోభాలకు లోటు లేదు 
యథా ప్రకారం ప్రలోభాల పర్వం సాగిపోతోంది. ఓటర్లు పరిమితంగా ఉండడంతో పాటు వారి వృత్తి, కులం వివరాలు పార్టీలకు తెలుసు. దీంతో భారీ మొత్తాల్లో నగదు, కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లోనే నగదును చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఎన్నికల తరహాలో రూ.కోట్లలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికల్లో లక్షల్లో ఓటర్లు ఉంటారు. రూ.కోట్లలో ఖర్చు కావడం సహజమే. అయితే వేల సంఖ్యలో ఉన్న ఓటర్లకు రూ.కోట్లలో ఖర్చు చేయడం బట్టి గెలుపును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదీ అర్థమవుతుంది. కొందరు అభ్యర్థులు రూ.40 కోట్ల వరకు ధారపోస్తున్నట్లు అంచనాలున్నాయి.   

ఎమ్మెల్సీ స్థానాలు, పరిధిలోని జిల్లాలు  
► వాయువ్య పట్టభద్రుల స్థానం – విజయపుర, బాగల్‌కోటె, బెళగావి. మొత్తం ఓటర్లు– 99,597  
►æ వాయువ్య ఉపాధ్యాయ స్థానం – విజయపుర, బాగల్‌కోటె, బెళగావి. మొత్తం ఓటర్లు 25,390  
► పశ్చిమ ఉపాధ్యాయ స్థానం – ధారవాడ, హావేరి, గదగ్, ఉత్తర కన్నడ. మొత్తం ఓటర్లు 17,973  
► దక్షిణ పట్టభద్రుల స్థానం – మైసూరు, చామరాజనగర, మండ్య, హాసన. మొత్తం ఓటర్లు 1,41,961  
పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు 
► వాయువ్య పట్టభద్రుల స్థానం – నిరాణి హనుమంత రుద్రప్ప (బీజేపీ), సునీల్‌ అణ్ణప్ప (కాంగ్రెస్‌)  
► వాయువ్య ఉపాధ్యాయ స్థానం – అరుణ శహాపుర (బీజేపీ), ప్రకాశ్‌ బాపణ్ణ హుక్కేరి (కాంగ్రెస్‌), చంద్రశేఖర్‌ లోణి (జేడీఎస్‌)  
► పశ్చిమ ఉపాధ్యాయ స్థానం – బసవరాజ్‌ హొరట్టె (బీజేపీ), బసవరాజ్‌ గురికార (కాంగ్రెస్‌), శ్రీశైల గడదిన్నె (జేడీఎస్‌)  
► దక్షిణ పట్టభద్రుల స్థానం – మై.వి.శంకర్‌ (బీజేపీ), మధు మాదెగౌడ (కాంగ్రెస్‌), హెచ్‌కే రాము (జేడీఎస్‌) 

మరిన్ని వార్తలు