Karnataka Politics: కర్ణాటక కొత్త బాస్‌ బొమ్మై 

28 Jul, 2021 01:37 IST|Sakshi
సీఎంగా ఎంపికైన బసవరాజ బొమ్మైకు పుష్పగుచ్ఛమిచ్చి అభినందిస్తున్న మాజీ సీఎం యడియూరప్ప, కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ తదితరులు

సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం

బుధవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం

బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ సోమప్ప బొమ్మై(61)ని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. బీజేపీ హైకమాండ్‌ ఆదేశంతో సీఎం యడియూరప్ప సోమవారం ఉదయం రాజీనామా చేయడం తెలిసిందే. కొత్త సీఎం ఎంపిక వ్యవహారం పర్యవేక్షణకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డిని హైకమాండ్‌ నియమించింది. వీరిద్దరూ కలిసి రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి అరుణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటిల్, జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఆపద్ధర్మ సీఎం బీఎస్‌ యడియూరప్ప సమక్షంలో యడ్డీ కేబినెట్‌లో హోం, న్యాయవ్యవహారాల మంత్రిగా ఉన్న బొమ్మై పేరు ఖరారు చేశారు.

అనంతరం మంగళవారం సాయంత్రం బెంగళూరులోని క్యాపిటల్‌ హోటల్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి లాంఛనంగా బొమ్మైని ఎన్నుకున్నారు. తదనంతరం బొమ్మై, యడియూరప్ప ఆశీస్సులు అందుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, సీనియర్‌నేత సీటీ రవి, పలువురు మంత్రులు రేసులో ఉన్నా బొమ్మైకి యడియూరప్ప గట్టి మద్దతు ఇవ్వడం కలసి వచ్చింది. రేసులో పలువురు ఉన్నప్పటికీ ఉత్తర కర్ణాటక, లింగాయత్‌ వర్గానికే సీఎం పీఠం కట్టబెట్టాలని బీజేపీ హైకమాండ్‌ భావించింది. సీఎంగా ఎన్నికవగానే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయనతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుతా: బొమ్మై
కరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రాధాన్యమిస్తానని కర్ణాటక కొత్త సీఎంగా ఎన్నికైన బసవరాజ బొమ్మై చెప్పారు. వరదలు, కరోనాతో బాధలు పడ్డ ప్రజలకు ఊరటనిస్తానన్నారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో కరోనా భారీగా విజృంభించింది. ఇదే సమయంలో వరదలు సంభవించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, మాజీ సీఎం యడియూరప్పకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వీరి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. బొమ్మైను సీఎంగా ఎంపిక చేయడంతో ఆయన సొంత నియోజకవర్గం సిగ్గాన్‌లో సంబరాలు అంబురాన్నంటాయి.  


 

మరిన్ని వార్తలు