Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

21 Sep, 2023 19:47 IST|Sakshi

చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని విమర్శించారు. రాష్ట్రపతి గిరిజన మహిళ, వితంతువు కావడం వల్లే ఆహ్వనించలేదని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు వేళ బాలీవుడ్‌ హీరోయిన్స్‌ను పార్లమెంట్‌కు ఆహ్వానించారన్న ఉధనియనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మం అంటే ఇదేనా అని బీజేపీని ప్రశ్నించారు. 

కాగా ఇటీవల సైతం సనాతన ధర్మంపై మంత్రి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ.. దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు తమిళనాడు మంత్రి. ఈ మాటలపై బీజేపీ సహా హిందూ సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ సైతం సనాతన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్శాన్ని నిర్మూలించడమే ఇండియా కూటమి లక్ష్యమని అన్నారు. 

ఇదిలా ఉండగా ఇటీవల సామాజిక వివక్షపై తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఉదయనిధి స్టాలిన్.. దాన్ని నిర్మూలించాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. సనాతన ధర్మం వల్లే అంటరానితనం వచ్చిందని.. ఈ రెండు కవల పిల్లలు అని అన్నారు. సనాత‌న ధ‌ర్మాన్ని నాశనం చేయాలని.. అప్పుడే సమాజంలో అంటరానితనం, అస్పృశ్య‌త‌, సామాజిక వివక్ష పోతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు