రెండుసార్లు ప్రధాని అయ్యారు.. చాలదా అన్నారాయన! కానీ నేనేంటో..

12 May, 2022 21:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వితంతువులు, వృద్ధులు & నిరుపేద పౌరుల కోసం గుజరాత్ ప్రభుత్వం ఆర్థిక సహాయ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా.. రెండుసార్లు ప్రధాని అయ్యింది చాలదా? అంటూ ఓ విపక్ష నేత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారాయన. 

‘‘ఒక రోజు చాలా పెద్ద నాయకుడు నన్ను కలిశాడు. ఆయన రాజకీయంగా మా సిద్ధాంతాల్ని వ్యతిరేకించే వ్యక్తి. అయినా నేను ఆయన్ని గౌరవిస్తా. అయితే ఆ టైంలో జరిగిన కొన్ని పరిణామాలపై ఆయన సంతోషంగా లేరు. అందుకే అతను నన్ను కలవడానికి వచ్చారు. మోదీ జీ.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానమంత్రిని చేసింది. ఇప్పుడు మీకు ఇంతకంటే ఏమి కావాలి. ఇక చాలాదా? అన్నారు. అంటే.. ఒక వ్యక్తి రెండుసార్లు ప్రధాని అయితే.. అతను ప్రతిదీ సాధించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.. 

కానీ, మోదీజీ అందరిలా కాదని ఆయనకు తెలియదు. నన్ను తయారు చేసింది గుజరాత్‌ గడ్డ. అందుకే ఏం జరిగితే అది జరుగుతుందని, ఇక విశ్రాంతి తీసుకుందాం అని అనుకునే రకం కాదు నేను. నా కల.. సంక్షేమ పథకాలను నూటికి నూరు శాతం అందించడమే. అప్పటిదాకా నెమ్మదించే ఉద్దేశం నాకు లేద’’ని అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఆ నేత ఎవరన్నది నేరుగా చెప్పకపోయినా.. శివ సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ కుటుంబ సభ్యులపై కేంద్ర సంస్థల చర్యలను ఖండిస్తూ శరద్‌ పవార్‌ గతంలో ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికీ తెలుసు.

మరిన్ని వార్తలు