Mamata Banerjee: భారత్‌ను రక్షించిన బెంగాల్‌

3 May, 2021 05:15 IST|Sakshi

మానవత్వాన్ని సైతం కాపాడింది

తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయంపై మమతా బెనర్జీ వ్యాఖ్యలు

దేశ ప్రజలందరికీ కరోనా టీకా కేంద్రం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌

లేకపోతే గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరిక  

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ తన తీర్పుతో భారతదేశాన్ని రక్షించిందని తృణమూ ల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం  మమతా బెనర్జీ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టిన బెంగాల్‌ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె ఆదివారం సాయంత్రం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌–19 మహమ్మారిని అరికట్టడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు.

వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడా విజయోత్సవాలు జరపొద్దని పార్టీ శ్రేణుల కు విజ్ఞప్తి చేశారు. ఇది బెంగాల్‌ ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. ఈరోజు భారత్‌ను బెంగాల్‌ కాపాడిందని పేర్కొ న్నారు. మానవత్వాన్ని సైతం రక్షించిందని వివరిం చారు. ఎన్నో అవాంతరాలకు ఎదురొడ్డి నిలిస్తే ఈ గెలుపుదక్కిందని వెల్లడించారు. కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, యంత్రాం గానికి వ్యతిరేకంగా పోరాటం సాగించామని గుర్తుచేశారు.

డబుల్‌ ఇంజన్‌ కాదు.. డబుల్‌ సెంచరీ
ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపైనా దీదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈసీ తమ పార్టీని వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం గురించి మాట్లాడగా, ఎన్నికల్లో తమ పార్టీ డబుల్‌ సెంచరీ సాధించిందని వ్యాఖ్యానించారు. 2021లో 221 సీట్లు సాధించాలని ఆశించామని, లక్ష్యానికి చేరువయ్యా మని చెప్పారు. నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగిందని, దీనిపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. బెంగాల్‌లో గొప్ప విజయం సాధించామని, అదే సమయంలో నందిగ్రామ్‌ ప్రజల తీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. వారి తీర్పు ఏదైనప్పటికీ అంగీకరిస్తానని తెలిపారు.

భారతీయులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాల్సిందే  
ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. పూర్తిగా కోలుకుంటానని, కాలుకు కట్టు (ప్లాస్టర్‌) తొలగిస్తానని కొద్ది రోజుల క్రితమే చెప్పానని అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. బెంగాల్‌ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందజేస్తానని పునరు ద్ఘాటించారు. ప్రతి భారతీయుడికి ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని 140 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వడానికి రూ.30,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేశారు.

ఉచిత టీకా విషయంలో తన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే కోల్‌కతాలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. ఎన్నికల్లో తమ పార్టీకి అద్భుతమైన విజయం దక్కినప్పటికీ ప్రమాణ స్వీకారం నిరాడంబరంగానే చేస్తానని చెప్పారు. ఆర్భాటానికి దూరంగా ఉంటామన్నారు. కరోనా ఉధృతి కారణంగా విజయోత్సవాలకు సమయం లేదని, మహమ్మారిని అరికట్టడంపైనే దృష్టి పెడతానని వివరించారు. ఈ ముప్పు తొలగిపోయాక కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మెగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు