వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్‌ కిశోర్‌

3 May, 2021 04:21 IST|Sakshi

కోల్‌కతా: దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహరచనల్లో సాయపడిన ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించబోనని ఆదివారం ప్రకటించారు. గతంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), వైఎస్‌ఆర్‌సీపీ, డీఎంకే పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. తాను ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వేళ ప్రశాంత్‌ ఇలా అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆదివారం ఇండియా టుడే టీవీ చానెల్‌లో మాట్లాడిన సందర్భంగా ప్రశాంత్‌ తన నిర్ణయాన్ని బయట పెట్టారు.

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్‌ కేంద్ర ఎన్నికల సంఘం... బీజేపీకి మరో రూపం అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. ‘ ఇంతగా ఒకటే రాజకీయ పార్టీ కోసం పనిచేసే కేంద్ర ఎన్నికల సంఘంను నేనెప్పుడూ చూడలేదు. బీజేపీకి సాయపడేందుకు ఈసీ చేయాల్సినదంతా చేసింది. మతం కార్డును వాడు కోవడం, ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీకి అనుకూ లంగా తీర్చిదిద్దడం, నియమాలను తుంగలో తొక్కడం.. ఇలా ప్రతీ అంశంలో బీజేపీకి అనువు గా ఈసీ వ్యవహరించింది’ అని ప్రశాంత్‌ ఆరోపించారు. ‘బెంగాల్‌లో ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీ మాత్రం బెంగాల్‌లో బలమైన పార్టీ గా ఎదిగింది’ అని ప్రశాంత్‌ వ్యాఖ్యానించారు. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ 100లోపు స్థానాలనే గెలుస్తుందని గత ఏడాది డిసెంబర్‌లో ప్రశాంత్‌ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

2014లో మోదీతో మొదలై..
రాజకీయ శ్రేణుల్లో పీకేగా ముద్దుగా పిలుచుకునే ప్రశాంత్‌కిశోర్‌ మొదటిసారిగా నేరుగా రాజకీయపార్టీల కోసం పనిచేసింది మాత్రం 2014లోనే. గుజరాత్‌ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగినపుడు ‘ఛాయ్‌ పే చర్చ’ అంటూ మొదలైన వినూత్న ప్రచార కార్యక్రమ వ్యూహాల్లో ప్రశాంత కీలక భూమిక పోషించారని కలకత్తా రీసెర్చ్‌ గ్రూప్‌ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు అయిన రజత్‌ రాయ్‌ చెప్పారు. 2015లో బిహార్‌లో నితీశ్‌కుమార్‌ కోసం ఎన్నికల వ్యూహాల్లో ప్రశాంత్‌ కిశోర్‌ చాలా నెలలు పనిచేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అమరీందర్‌ సింగ్‌తో కలిసి పీకే ఎత్తుగడలు వేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించడంలోనూ ప్రశాంత్‌ పాత్ర కీలకమైంది. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అధినేత  కేజ్రీవాల్‌కు అండగా నిలిచారు.  బాల్య వివాహాల ను ఆపేలా, అమ్మాయిల చదువులు కొనసాగేలా చేసిన ఐక్యరాజ్యసమితి అవార్డు పొందిన ‘కన్యాశ్రీ’ వంటి పథకాలతో  మహిళా పక్షపాత ప్రభుత్వమని టీఎంసీకి పేరు తెచ్చిన ఘనత పీకేదే. ఈసారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేశారు.  ఎన్నికల వ్యూహాలు ఇక రచించను 

 

మరిన్ని వార్తలు