మమతా బెనర్జీ భవితవ్యం తేలేది నేడే

3 Oct, 2021 06:48 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఆమె పోటీ చేసిన భవానీపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఈ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుందని అధికారులు   తెలిపారు. భవానీపూర్‌  నియోజకవర్గం అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పారీ్టకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది.  కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్‌ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు.   

>
మరిన్ని వార్తలు