ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా

14 Mar, 2022 19:22 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఒకరోజు ముందు సోమవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు స్వయంగా అందజేశారు. 

పంజాబ్‌లోని సంగ్రూర్ నియోజకవర్గానికి 2014 నుంచి భగవంత్ మాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ‘సంగ్రూర్ ప్రజలు చాలా సంవత్సరాలుగా నాపై అమితమైన ప్రేమను కురిపించారు. దీనికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు పంజాబ్ మొత్తానికి సేవ చేసే అవకాశం వచ్చింది. సంగ్రూర్ ప్రజలకు నేను వాగ్దానం చేస్తున్నాను, వారి కోసం ధీటైన గొంతు త్వరలో ఈ సభలో ప్రతిధ్వనిస్తుంద’ని ఆయన పేర్కొన్నారు. 

48 ఏళ్ల భగవంత్‌ మాన్‌.. పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. (క్లిక్‌: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు)

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. సంగ్రూర్ జిల్లాలోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భగవంత్‌ మాన్‌.. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. (క్లిక్‌: సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కొడుకు.. తల్లి మాత్రం స్వీపర్‌గానే.. ఎవరా మహిళ..?)

>
మరిన్ని వార్తలు