భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. ప్రజల బాధలు విని కన్నీళ్లు పెట్టుకున్నా.. ముగింపు సభలో రాహుల్..

31 Jan, 2023 03:17 IST|Sakshi
‘స్నో’గన్‌: జోడో యాత్ర ముగింపు సభలో ప్రసంగిస్తున్న రాహుల్‌గాంధీ

మోదీ, అమిత్‌ షాలపై రాహుల్‌గాంధీ ధ్వజం

ఆ నొప్పి వారికి అర్థం కాదంటూ చురకలు

కశ్మీర్లో పాదయాత్ర చేయాలంటూ సవాలు

ఘనంగా ముగిసిన భారత్‌ జోడో యాత్ర

శ్రీనగర్‌లో వణికించే చలిలో ముగింపు సభ

నా కోసం కాదు, దేశం కోసమే పాదయాత్ర

మంచులో తడుస్తూనే మాట్లాడిన రాహుల్‌

హాజరై సంఘీభావం ప్రకటించిన 9 విపక్షాలు

శ్రీనగర్‌: ‘‘దేశంలో స్వేచ్ఛాయుత, లౌకిక విలువలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ, ఆరెస్సెస్‌ నిత్యం దాడి చేస్తున్నాయి. వాటికి పాతర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం నిరంతరం హింసను ప్రేరేపిస్తున్నాయి’’ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఆ విలువల పరిరక్షణకే భారత్‌ జోడో యాత్ర చేపట్టినట్టు పునరుద్ఘాటించారు. జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది.

సభలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా తదితరులు 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీని, షేర్‌ ఏ కశ్మీర్‌ క్రికెట్‌ స్టేడియంలో సభ నిర్వహించింది. దీనిలో తొమ్మిది విపక్ష పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విపరీతంగా కురుస్తున్న మంచులో  తడుç­Ü్తూనే రాహుల్‌ మాట్లాడారు. హింస ఎంతటి బాధాకరమో మోదీ లాంటివారికి ఎన్నటికీ అర్థం కాదంటూ ఆక్షేపించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీల హత్యోదంతాలను గుర్తు చేసుకున్నారు. ‘‘వారిక లేరని ఫోన్‌ కాల్స్‌ ద్వారానే తెలుసుకున్నా.

ఆ దుర్వార్తలు విని విలవిల్లాడిపోయా. అలాంటి ఫోన్‌ కాల్స్‌ అందుకోవాల్సి రావడంలో ఉండే అంతులేని బాధను, నొప్పిని కశ్మీరీలు అర్థం చేసుకోగలరు. పుల్వామా వంటి ఉగ్ర దాడులకు బలైన ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది కుటుంబాలు అర్థం చేసుకోగలవు. నేను, నా చెల్లెలు అర్థం చేసుకోగలం. అంతేగానీ మతిలేని హింసను ప్రేరేపించే మోదీ, అమిత్‌ షా (కేంద్ర హోం మంత్రి), అజిత్‌ దోవల్‌ (జాతీయ భద్రతా సలహాదారు), ఆరెస్సెస్‌ నేతల వంటివాళ్లు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.

ఎందుకంటే దాని తాలూకు బాధను వాళ్లెప్పుడూ అనుభవించనే లేదు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘సైనికుడు కావచ్చు, సీఆర్పీఎఫ్‌ జవాను కావచ్చు, కశ్మీరీ కావచ్చు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తమ వారు ఇక లేరనే దుర్వార్త మోసుకొచ్చే అలాంటి ఫోన్‌ కాల్స్‌కు శాశ్వతంగా తెర దించడమే జోడో యాత్ర లక్ష్యం. అంతే తప్ప నా స్వీయ లబ్ధి కోసమో, కాంగ్రెస్‌ పార్టీ కోసమో కాదు. దేశ ప్రజల కోసం. దేశ పునాదులను నాశనం చేయజూస్తున్న భావజాలానికి అడ్డుకట్ట వేయడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు.

కశ్మీర్లో నడవాలంటే వారికి భయం
బీజేపీ అగ్ర నేతలకు దమ్ముంటే తనలా జమ్మూ కశ్మీర్లో పాదయాత్ర చేయాలని రాహుల్‌ సవాలు విసిరారు. ‘‘అది వారి తరం కాదు. చేయలేరు. ఒక్కరు కూడా జమ్మూ కశ్మీర్లో నాలా నడవలేరు. ఎందుకంటే వారికి అంతులేని భయం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కశ్మీర్లో పాదయాత్ర వద్దని నాకు సలహాలొచ్చాయి. బులెట్‌ ప్రూఫ్‌ కార్లో చేయాలని స్థానిక యంత్రాంగమూ సూచించింది. నడిస్తే నాపై ఏ గ్రెనేడో వచ్చి పడొచ్చని హెచ్చరించింది. బహుశా నన్ను భయపెట్టడం వారి ఉద్దేశం కావచ్చు. కానీ నేను భయపడలేదు.

నన్ను ద్వేషించేవారికి నా తెల్ల టీ షర్టు రంగు (ఎర్రగా) మార్చే అవకాశం ఎందుకివ్వకూడదని ఆలోచించా. ఈ రాష్ట్రం నా సొంతిల్లు. కశ్మీరీలు నావాళ్లు. వాళ్లతో కలిసి నడిచి తీరాలని నిర్ణయించుకున్నా. కశ్మీరీలు నాపై గ్రనేడ్లు విసరలేదు. హృదయపూర్వకంగా అక్కున చేర్చుకున్నారు. అంతులేని ప్రేమతో ముంచెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మనస్ఫూర్తిగా స్వాగతించి నన్ను తమవాణ్ని చేసుకున్నారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘నాకు లేనిదీ, బీజేపీ నేతలకున్నదీ భయమే. నిర్భయంగా జీవించడాన్ని మహాత్మా గాంధీ నుంచి, నా కుటుంబం నుంచి నేర్చుకున్నా’’ అన్నారు.

కాంగ్రెస్‌ ర్యాలీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రాతో పాటు డీఎంకే, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ), సీపీఐ, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, వీసీకే, ఐయూఎంఎల్‌ నేతలు మాట్లాడారు. 22 పార్టీలకు ర్యాలీకి కాంగ్రెస్‌ ఆహ్వానం పంపగా తృణమూల్‌ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీ(యూ) తదితర ముఖ్య పక్షాలు గైర్హాజరయ్యాయి.

సోదరితో సరదాగా...
భారీ భద్రత, యాత్ర, రాజకీయాలు, ప్రసంగాలు, విమర్శల నడుమ రాహుల్‌ కాసేపు సోదరి ప్రియాంకతో సరదాగా స్నోబాల్‌ ఫైట్‌ చేస్తూ సేదదీరారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఒక వీడియోలో రాహుల్‌ రెండు మంచు ముక్కలను వెనక దాచుకుని ప్రియాంకను సమీపించి ఆమె తలపై కొట్టి ఆట పట్టించారు. ఆమె కూడా ఆయన వెంట పడి తలంతా మంచుతో నింపేశారు. తర్వాత జోడో యాత్ర క్యాంప్‌ సైట్‌ వద్ద, అనంతరం పీసీసీ కార్యాలయంలోనూ రాహుల్‌ జాతీయ జెండా ఎగురవేశారు. యాత్రలో తనతో పాటు కలిసి నడిచిన భారత యాత్రీలకు కృతజ్ఞతలు తెలిపారు. వణికించే చలిలోనూ ఇన్ని రోజులుగా కేవలం తెల్ల టీ షర్టుతోనే యాత్ర చేసిన రాహుల్‌ ఎట్టకేలకు సోమవారం జాకెట్‌ ధరించారు. తర్వాత పొడవాటి సంప్రదాయ బూడిద రంగు కశ్మీరీ ఫేరన్‌ ధరించి ర్యాలీలో, సభలో పాల్గొన్నారు.

ఇదే సొంతిల్లు
కశ్మీర్‌ తన సొంతిల్లని రాహుల్‌ పదేపదే గుర్తు చేసుకున్నారు. ‘‘రాష్ట్రంలో నడుస్తుంటే అప్పుడెప్పుడో సరిగ్గా ఇవే దారుల గుండా నా పూర్వీకులు కశ్మీర్‌ నుంచి అలహాబాద్‌ వెళ్లారన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. నేను నా ఇంటికి తిరిగొస్తున్నట్టు ఫీలయ్యా. ఎందుకంటే నాకంటూ ఓ ఇల్లు లేదు. చిన్నతనం నుంచీ ప్రభుత్వ ఆవాసాల్లోనే బతికాను. వాటిని నా ఇల్లని ఎప్పుడూ అనుకోలేకపోయాను. నా వరకూ ఇల్లంటే ఓ ఆలోచన. జీవన విధానం. కశ్మీరియత్‌ శివుని ఆలోచనా ధార. శూన్యత్వం. అహంపై పోరాడి గెలవడం. ఇది నన్నెంతో ఆకట్టుకుంది. దీన్నే ఇస్లాంలోనూ ఫనా అన్నారు. అస్సాం, కర్నాటక, మహారాష్ట్ర... అన్ని రాష్ట్రాల్లోనూ ఈ భావధార ఉంది. దీన్నే గాంధీ వైష్ణో జనతో అన్నారు. నా పూర్వీకులు ఇక్కణ్నుంచి వెళ్లి అలహాబాద్‌లో గంగా తీరాన స్థిరపడి కశ్మీరియత్‌ను యూపీలో ప్రచారం చేశారు. అదే గంగా యమునా పవిత్ర సంగమం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా ఇంటికి వెళ్తున్నట్టు అన్పిస్తోంది’ అంటూ జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించే ముందు తల్లి సోనియాకు, తనకు రాహుల్‌ మెసేజ్‌ చేశారని ప్రియాంక చెప్పుకొచ్చారు.

ఎవరేమన్నారంటే...
ఎన్నికల యాత్ర కాదు
భారత్‌ జోడో యాత్ర ఎన్నికల్లో గెలుపు కోసం కాదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దేశ ప్రజలనందరినీ ఒక్కటి చేయగలనని రాహుల్‌ పాదయాత్రతో నిరూపించారు
– మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

లౌకిక పార్టీలన్నీ ఒక్కటవాలి
బ్రిటిష్‌ పాలనపై ఐక్యంగా పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. అలాగే బీజేపీ పాలనపైనా పోరుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలి.
– డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి

పశ్చిమం నుంచి తూర్పుకూ...
శాంతి, సౌభ్రాతృత్వాలు కోరుకునే వారికి దేశంలో కొదవ లేదని జోడో యాత్ర నిరూపించింది. దక్షిణం నుంచి ఉత్తరానికి చేసినట్టుగానే దేశ పశ్చిమ కొస నుంచి తూర్పుకు కూడా రాహుల్‌ పాదయాత్ర చేయాలి. నేను ఆయన వెంట నడుస్తా.
ఒమర్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌

రాహుల్‌ ఓ ఆశాకిరణం
రాహుల్‌గాంధీలో దేశానికి ఒక నూతన ఆశా కిరణం దొరికింది.
– మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు

విభజన రాజకీయాలే ముప్పు
విభజన రాజకీయాలు దేశానికెప్పుడూ హానికరమే. వాటిని వ్యతిరేకిస్తూ నా సోదరుడు చేసిన యాత్రకు జనం వస్తారో లేదోనని అని నేను మొదట్లో అనుకున్నా. కానీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా ఆద్యంతం వారు భారీగా తరలి వచ్చి సంఘీభావంగా నిలిచారు. ఐక్యతా స్ఫూర్తిని చాటారు. దేశమంతా యాత్రకు ఇంతగా మద్దతుగా నిలవడం నిజంగా గర్వకారణం.
– ప్రియాంకా గాంధీ వద్రా

చదవండి: కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్..

మరిన్ని వార్తలు