Rahul Gandhi: నితీష్‌, టీఆర్‌ఎస్‌తో మాట్లాడితే మాకు సంబంధం లేదు

31 Oct, 2022 15:08 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని తెలిపారు.  దేశ సమగ్రతకు, సమైక్యత కోసం రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం తిమ్మాపూర్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్పోరేట్‌ వర్గాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు అంత డబ్బు ఎలా వస్తోందని ప్రశ్నించారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య పార్టీకి ఎలాంటి అవగాహన లేదని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. .కాంగ్రెస్‌ ఒంటరిగానే ఎన్నికల్లో పోరాడుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ‘నితీష్‌, టీఆర్‌ఎస్‌తో మాట్లాడితే మాట్లాడుకోవచ్చని, దాంతో తమకు సంబంధం లేదన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది. దళితులు, గిరిజనుల భూములను కబ్జా చేస్తోంది. విద్యను ప్రైవేటీకరణ చేసి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలను ఖర్గే చూసుకుంటారు. భారత్‌ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు. దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులపై పోరాట యాత్ర. దేశంలో బీజేపీ హింసను ప్రేరేపిస్తోంది. బీజేపీపై పోరాటం కోసమే నా భారత్‌ జోడో యాత్ర. ప్రజలు కాంగ్రెస్‌తో విడిపోలేదు. ప్రజలతో కనెక్ట్‌ కావడానికే యాత్ర. బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ. కశ్మీర్‌ వెళ్లిన తర్వాత నేనేం అనుకుంటున్నా అనేది చెప్తా.’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: ‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు! 

మరిన్ని వార్తలు