అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!

23 Sep, 2022 17:55 IST|Sakshi

కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం మినహా వేరే దిక్కు లేదా? వందేళ్ళు దాటిన కాంగ్రెస్‌ మూడేళ్లుగా అధ్యక్షుడు లేకుండానే కొనసాగుతోంది. ఎట్టకేలకు ఎన్నికల ద్వారా పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ రాహుల్ మీద ఒత్తిడి మాత్రం తగ్గలేదు. కాంగ్రెస్‌ చీఫ్‌గా వేరేవారు ఎన్నికైతే మరి రాహుల్ గాంధీ ఏంచేస్తారు? 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల తతంగం ప్రారంభమైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత.. ఇంతవరకు అధ్యక్షుడు ఎవరూ లేరు. అనారోగ్యం కారణంగా కొన్నేళ్ళ క్రితమే బాధ్యతల నుంచి తప్పుకున్న సోనియా గాంధీనే గత్యంతరం లేని పరిస్థితుల్లో తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ముక్త్ భారత్ అంటూ కాషాయ సేన అన్ని రాష్ట్రాల మీద దండయాత్ర చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్ష ఎన్నికల హడావుడి కూడా మొదలైంది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌, ఎంపీ శ‌శిథ‌రూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరో సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ తెరమీదకు వచ్చారు. తాను కూడా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేద్దామనుకుంటున్నట్లు ప్రకటించారు. 

చదవండి: (నువ్వా నేనా.. అనంత అసెంబ్లీ టికెట్‌ దక్కేదెవరికో..?)

అయితే.. చివ‌రి నిమిషం వ‌ర‌కు రాహుల్ గాంధీని అధ్యక్ష ఎన్నిక‌ బరిలోకి దిగేలా ఒత్తిడి తీసుకువ‌చ్చేందుకు గెహ్లట్ ప్రయ‌త్నిస్తూనే ఉన్నారు. అలాగే తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల పీసీసీలు కూడా రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉండాల‌ని తీర్మానాలు చేసి పంపిస్తున్నాయి. అశోక్ గెహ్లట్‌ రాజ‌స్థాన్ ముఖ్యమంత్రి ప‌ద‌వి వ‌దులుకోవ‌డానికి సిద్ధప‌డ‌తారా? అన్నదానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక వేళ సీఎం ప‌ద‌వి వ‌ద‌లుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తే త‌న ప్రత్యర్థి స‌చిన్ పైల‌ట్‌కు ఆ ప‌ద‌వి అప్పగించాల్సి వ‌స్తుంది. అంత ఈజీగా సీఎం ప‌ద‌విని అశోక్ గెహ్లట్ వ‌దులుకుంటారా? తన చెప్పుచేతల్లో ఉండే మనిషిని సీఎంగా నియమించాలని కోరతారా? లేక రెండు ప‌ద‌వుల్లో కొన‌సాగేలా ప్రత్యేక అనుమ‌తి పొందుతారా? అన్నది వేచి చూడాలి. జైపూర్ చింత‌న్ శిబిర్ డిక్లరేష‌న్ ప్రకారం ఒక వ్యక్తికి రెండు ప‌ద‌వులు ఇవ్వకూడ‌దు. 

తొమ్మిదివేల మంది ఏఐసీసీ స‌భ్యులు ఓటు వేసే ఈ ఎన్నిక‌ల‌లో పోటీ చేద్దామనుకుంటున్న నేతలు చివ‌రి దాకా బ‌రిలోనే ఉంటారా? లేక అధ్యక్ష పదవి ఏక‌గ్రీవం అవుతుందా అన్నది చూడాలి. సీనియర్ నాయకుల్లో ఎవ‌రు ఎన్నికైనా 20 ఏళ్ల త‌ర్వాత గాంధీయేత‌ర కుటుంబానికి చెందిన వ్యక్తి మరోసారి కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించిన‌ట్లవుతుంది. చివ‌రిసారిగా గాంధీయేత‌ర కుటుంబం నుంచి  సీతారాం కేస‌రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత‌లు నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఎవ‌రు కూర్చున్నప్పటికీ.. పార్టీ మొత్తం త‌మ నాయకుడిగా రాహుల్ గాంధీనే ప్రజ‌ల ముందుకు తీసుకెళ్తుందనేది స్పష్టం. సో అధ్యక్షులు ఎవ‌రైనా... రాహుల్ గాంధీయే తమ నాయ‌కుడ‌ని భార‌త్ జోడో యాత్ర ద్వారా ప్రజ‌ల‌కు చెప్తోంది కాంగ్రెస్ పార్టీ.

మరిన్ని వార్తలు