టీఆర్‌ఎస్‌ టూ బీఆర్‌ఎస్‌.. సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

5 Oct, 2022 14:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో మార్పు కోసమే తన ప్రయత్నమని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తున్నట్లు ఆయన బుధవారం అధికారికంగా ప్రకటించారు. సర్వ సభ్య సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ, ప్రజలకు ఏమి కావాలో బీజేపీ, కాంగ్రెస్‌ గుర్తించట్లేదు. తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం. దేశ ప్రజలకు ఇచ్చే హామీలనూ అమలు చేస్తాం. అన్ని పక్షాలు బీఆర్‌ఎస్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని’’ కేసీఆర్‌ అన్నారు.
చదవండి: టీఆర్‌ఎస్‌ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత.. 

తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. జాతీయ రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావించింది. జాతీయ పార్టీకి సంబంధించిన పేపర్లపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌(భారత్‌ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచి టీఆర్‌ఎస్‌ కనుమరుగు కానుంది. టీఆర్‌ఎస్‌ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ అవతరించింది.

మరిన్ని వార్తలు