‘ఎంఐఎంతో కాంగ్రెస్‌ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు’

5 Dec, 2020 16:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదని కాంగ్రెస్‌ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ మత పరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టిందని ఆయన ఆరోపించారు. ఎంఐఎం, బీజేపీ నగర ప్రజలను భయాందోళనకు గురిచేశారన్నారు. ఈ మేరకు శనివారం గాంధీ భవర్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు, కార్యకర్తలకు, ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. స్వాగతిస్తున్నామన్నారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని పోలీసు అధికారులతో చెప్పించారని విమర్శించారు. భావోద్వేగాలతో తాత్కాలికంగా లాభం పొందవచ్చు కానీ అభివృద్ధి జరగదని తెలిపారు. చదవండి: బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ

ఎన్నికలు మత పరమైన భావోద్వేగాల చుట్టూ తిరగడంతో కాంగ్రెస్ ఓటమి చెందిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో గెలుపు ఓటములే ప్రామాణికంగా తీసుకుంటారని,  కాంగ్రెస్ పార్టీ ఓటమిపై రి-ఓరియెంటెషన్ చేసుకుంటామని తెలిపారు. అందరం కలిసి సమిష్టిగా సమీక్ష చేసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు తాత్కాలికమేనని తెలిపాన బట్టి విక్రమార్క.. భవిష్యత్తులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. జానారెడ్డి పార్టీ మారుతున్నారని చెబితే స్పందించేవాళ్ళమని అన్నారు.

మరిన్ని వార్తలు