‘డబుల్‌’ ఇళ్లు చూపిస్తామని పారిపోయారు: భట్టీ

18 Sep, 2020 13:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు చూపిస్తామని చెప్పి మంత్రి, నగర మేయర్‌ పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ‘డబుల్‌’ ఇళ్ల పరిశీలనలో భాగంగా తుక్కుగూడలోని మంకల్‌లో వారంతా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా భట్టీ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు చూపిస్తామని 3428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలని అన్నారు. గ్రేటర్‌ బయట కట్టిన ఇళ్లను కూడా చూపిస్తే ఎలా? అని ప్రశ్నించారు.
(చదవండి: ప్రగతి భవన్‌: ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం)

మరోవైపు లక్ష ఇళ్ల జాబితా ఇస్తాం.. మీరే చూసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. నగర శివారులో కట్టిన ఇళ్లు కూడా నగర వాసుల కోసమేనని మంత్రి తెలిపారు. దీంతో స్థలాలు చూపిస్తాం.. నగరంలోనే ఇళ్లు నిర్మించాలని భట్టి మరోసారి సవాల్‌ విసిరారు. స్థలాలు చూపిస్తే ఇళ్లు నిర్మించి ఇస్తామన్న మంత్రి తలసాని జవాబిచ్చారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పంపిణీ చేసిందని అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లనే కాదు.. హైదరాబాద్‌లో అభివృద్ధిని కూడా చూపిస్తామని తెలిపారు. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం తమకున్నాయని మంత్రి తలసాని మీడియాతో పేర్కొన్నారు.
(చదవండి: బస్తీమే.. సవాల్‌!)

మరిన్ని వార్తలు